స్వామి దయానంద సరస్వతి (Swamy Dayananda Saraswathi)…. దేశాన్ని, హిందూ సమాజాన్ని జాగృత పరిచిన గొప్ప వ్యక్తి. దేశంలో మొట్ట మొదటి సారి స్వపరిపాలన (స్వరాజ్) కావాలంటూ గర్జించిన సింహం ఆయన. భారత దేశం (India) భారతీయుల కోసమేనంటూ బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన వ్యక్తి ఆయన. ఆర్య సమాజ్ ద్వారా ఎంతో మంది పోరాట యోధులను తయారు చేసిన గొప్ప గురువు ఆయన.
12 ఫిబ్రవరి 1824లో గుజరాత్ లోని ఠంకార గ్రామంలో దయానంద సరస్వతి జన్మించారు. ఆయన అసలు పేరు మూల శంకర్. 22 ఏండ్ల వయస్సులో భగవంతుని అన్వేషణ కోసం బయలు దేరారు. విరజానంద స్వామి వద్ద వేదోపనిషత్తులను అవపోసన పట్టాడు. అనంతరం దేశ మంతటా వేదాల సారాన్ని ప్రభోదించాలని నిర్ణయించుకున్నారు.
తన ప్రయాణంలో దేశ పరిస్థితులు చూసి ఆయన చలించి పోయారు. ఒకప్పుడు ధర్మ సంస్కృతులకు కేంద్రంగా ఉన్న భారత్ ఇప్పుడు వలస పాలకుల పాలనలో దరిద్య్రాన్ని ఎదుర్కోవడం చూసి దు:ఖించారు. హిందువుల మధ్య విభేదాలు, అంద విశ్వాసాల వల్లే దేశం ఈ పరిస్థితికి చేరుకుందని గ్రహించారు.
ఎలాగైనా హిందు సమాజాన్ని జాగృత పరచాలని నిర్ణయించారు. ఆ మేరకు ఎన్నో సంస్కరణలు చేపట్టారు. సతి, బాల్య వివాహాలు, అంటరానితనం, వరకట్న దురాచారాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. ధర్మ సంస్థాపన కోసం ఆర్య సమాజ్ ను ఆయన స్థాపించారు. ఆ తర్వాత దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో, అటు తెలంగాణ ఉద్యమంలోనూ ఆర్య సమాజ్ కీలక పాత్ర పోషించింది. ఆర్య సమాజ్ కు చెందిన ఎంతో మంది వ్యక్తులు అటు దేశ, ఇటు తెలంగాణ ఉద్యమంలోనూ గొప్ప పోరాటాలు చేశారు.