ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ఆగ్రాలోని కోర్టు(agra court)లో సంచలన పిటిషన్(petition) దాఖలైంది. తాజ్‌మహల్(Taj Mahal)ను శివాలయంగా ప్రకటించాలంటూ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్ కోరింది. తాజ్ మహల్‌ను తేజోలింగ మహాదేవ్ ఆలయంగా అభివర్ణించింది. ట్రస్ట్ సివిల్ కోర్టు జూనియర్ విభాగంలో ఈ దావా వేశారు.
తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని కోరుతూ పలుమార్లు ఇప్పటికే పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొన్ని పిటిషన్లు కొట్టివేయగా, మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్ ఛైర్మన్, న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ తొలుత జనవరి 1, 2024న దావా వేశారు. దీనిలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 80 (1) ప్రకారం విచారణను పూర్తి చేయాలని కోరారు. ఆ క్రమంలో పలువురికి నోటీసులు పంపారు. దాని రెండు నెలల కాలపరిమితి కూడా దాటిపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం మళ్లీ దావా వేశారు.
ఈ పిటిషన్లో అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలను నిలిపివేయాలని, ప్రార్థనా స్థలానికి అనుచితమైన ఏవైనా ఇతర పద్ధతులను ఇవ్వాలని కోరింది. ఈ కేసు విచారణ ఏప్రిల్ 9న జరగనుంది. పిటిషనర్ వివిధ చారిత్రక పుస్తకాలను ఉదహరిస్తూ తేజోలింగ మహాదేవ్ ఆలయ నిర్మాణం తాజ్ మహల్‌గా గుర్తించబడటానికి ముందే ఉందని తన వాదనలో పేర్కొన్నారు.
అజయ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ తాను 2023 సంవత్సరంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి నుంచి సమాచారాన్ని తీసుకున్నట్లు తెలిపారు. తాజ్‌మహల్ నిర్మాణం గురించి తాను పరిశోధన చేసినట్లు వెల్లడించారు. అన్నింటినీ విశ్లేషించిన తర్వాత తాజ్ మహల్ ఉనికి కంటే ముందే తేజోలింగం మహాదేవుని ఆలయం ఉందని రుజువైందని న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ చెప్పుకొచ్చారు.