దేశవ్యాప్తంగా త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత పోరు.. బహిరంగంగా మారుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. అసలు కాంగ్రెస్ (Congress) అంటేనే నేతల మధ్య ఉన్న పోరు ఎప్పటికీ సమసిపోదు అనే భావన ఉన్న నేపథ్యంలో మరోసారి తమిళనాడులో ఈ రాజకీయ రచ్చ తెరమీదికి రావడం ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ నేతలే స్వయంగా మాజీ హోంమంత్రి, పి.చిదంబరం (P Chidambaram) కుమారుడికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. కార్తీ చిదంబరానికి లోక్ సభ టికెట్ ఇవ్వకూడదని శివగంగై కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, కార్తీ చిదంబరంకు టికెట్ ఇవ్వకూడదని శనివారం నాడు శివగంగైకు చెందిన కొందరు నేతలు డిమాండ్ చేశారు. తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామం చోటు చేసుకోవడం చర్చకు దారితీసింది.
అయితే ప్రస్తుతం కార్తీ చిదంబరం ఈ స్థానం నుంచి లోక్సభ (Lok Sabha) ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా ఆయన తండ్రి కూడా.. శివగంగై నుంచి 7 సార్లు ఎంపీగా పోటీ చేశారు. మరోవైపు అసంతృప్త నాయకులు నిర్వహించిన సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి ఈఎం సుదర్శన్ నాచియప్పన్ తో పాటు, పి చిదంబరం మద్దతుదారులు కూడా పాల్గొన్నారు.
ఈ భేటీలో శివగంగై లోక్ సభ అభ్యర్థిత్వానికి, కార్తీ చిదంబరానికి (Karthi Chidambaram) వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అయితే ఇలాంటి విభేదాలు గతంలో కూడా కొనసాగాయి. 2019లో కూడా కార్తీని రంగంలోకి దింపడాన్ని నాచియప్పన్ వ్యతిరేకించారు. అప్పుడు కూడా తమిళనాడు (Tamil Nadu) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి..