బీజేపీ (BJP) ప్రభుత్వం పదేండ్లుగా దేశాభివృద్ధి కోసం శ్రమిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ (Tarun Chugh) అన్నారు. దేశ ప్రజలంతా మోడీ ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారని వెల్లడించారు. దేశంలో మళ్లీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు.. ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ఆయన వ్యాఖ్యానించారు.
వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. కరీంనగర్‌లో తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ప్రపంచంలోనే ఇండియాను 3 వ స్థానానికి తీసుకు వెళ్లేందుకు నిరంతరంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకంతో బడ్జెట్ ప్రవేశపెట్టారని వివరించారు.
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు లక్ పతి పథకం ప్రవేశ పెట్టారని, 3కోట్ల మంది మహిళలకు లబ్ది చేకూరేలా బడ్జెట్ కేటాయించిందన్నారు. గత పదేళ్లుగా మహిళల అక్షరాస్యత శాతం 25 పెరిగిందన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వం పోయినప్పటికీ .కాంగ్రెస్ రూపంలో మరో అవినీతి ప్రభుత్వం వచ్చిందని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి సర్కార్ జాతీయ కాంగ్రెస్ కు ఫండింగ్ చేస్తోందన్నారు.
రాహుల్ యాత్ర కోసం రేవంత్ రెడ్డి విలువైన బస్సును ఏర్పాటు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదని విమర్శించారు. దేశంలో అధికారంలోకి రాని కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఓటు వేయడం దండగ అని వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. అది కాంగ్రెస్ గెలుపు కాదన్నారు.
గ్యారెంటీ లు అమలు చేయకుండా దాట వేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఆర్ఆర్, కాళేశ్వరం, ధరణి అవినీతి అని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి నేడు నోరు మెదపడం లేదని నిలదీశారు. సీబీఐ విచారణ అని గతం లో చెప్పిన రేవంత్ రెడ్డి మిన్నకుండి పోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు బీజేపీని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణా లో పదికి తగ్గకుండా పార్లమెంట్ స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.