తెలుగుదేశం (Telugudesam), జనసేన (Janasena) కూటములు అధికారంలోకి వస్తే నాలుగున్నరేళ్లలో వైసీపీ విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ ఎత్తివేస్తామని టీడీపీ ఎమ్మెల్సీ(Tdp Mlc) బుద్ధ వెంకన్న(Bhudha Venkanna) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.
అధికారంలోకి రాగానే వైపీసీ పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేస్తూ మొదటి సంతకం చేస్తామని చెప్పారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఇంతవరకు ఎవరికీ టిక్కెట్లు కేటాయించలేదని, ఒకవేళ ఎవరైనా పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నా అది అవాస్తవమని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.
చంద్రబాబు మళ్లీ జనంలోకి వస్తే రాష్ట్రంలో జన సునామీనేనని, పొత్తులపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి పార్టీ శ్రేణులంతా కట్టుబడి ఉంటామని చెప్పారు. వైసీపీ చేపడుతున్నది బీసీ యాత్ర కాదని, బేవర్స్ బస్సు యాత్ర అని వెంకన్న విమర్శించారు. ‘బస్సుల్లో మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్‌లు ఫుల్.. సభలకు జనం నిల్’ అంటూ ఎద్దేవా చేశారు.
జగన్ మంత్రివర్గంలో ఉన్న వారంతా పని లేని మంత్రులని ఆరోపించారు. సోమవారం నుంచి రాజోలు నియోజకవర్గంలో జరిగే నారా లోకేష్ యాత్రలో టీడీపీతో పాటు జనసేన కూడా పాల్గొంటుందని వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండకపోవచ్చునని బుద్ధ వెంకన్న చెప్పుకొచ్చారు.