ఏపీ (AP) టీడీపీ అధ్యక్షులు (TDP Chief) అచ్చెన్నాయుడు ( Atchannaidu) సమయం దొరికినప్పుడల్లా వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ ఉన్నారు. ముఖ్యంగా బాబు అరెస్ట్ అయినప్పటి నుంచి సీఎం జగన్ (CM Jagan) పై ఘాటువ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే మరొక సారి అచ్చెన్న తన నోటికి పని చెప్పారు. అవినీతిలో పుట్టి పెరిగిన వ్యక్తి జగన్ అని.. రూ.45 వేల కోట్లు ఈడీ (ED) జప్తు చేసిన వ్యక్తి మనకు సీఎం అవడం ఖర్మ అని ఎద్దేవా చేశారు.
బాబు అవినీతికి పాల్పడినట్టు ఇప్పటి వరకూ వైసీపీ (YCP) ఒక్క ఆధారం చూపలేకపోయిందని అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. దిక్కుమాలిన ప్రభుత్వం పూటకో మాట మార్చుతోందన్నారు. స్కిల్ కేసులో పస లేదని… అందుకే రోజుకొక పిటిషన్ వేసి కాలయాపన చేస్తున్నారన్నారని అచ్చెన్న పేర్కొన్నారు. అర్ధరాత్రి ఒక ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టు చంద్రబాబు (Chandrababu)పై అక్రమ కేసులు పెట్టి, గత 38 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు.
చంద్రబాబు రూ.3,400 కోట్లు అవినీతి చేశారని తొలుత ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు.. నాలుగు రోజుల తర్వాత రూ.340 కోట్లే అవినీతి జరిగిందంటూ మరోసారి ప్రచారం చేశారని, మళ్లీ ఐదు రోజుల తర్వాత రూ.27 కోట్లే చంద్రబాబు పార్టీ అకౌంట్లో పడ్డాయని అసత్య ప్రచారాలు చేశారని అచ్చెన్నాయుడు ఆగ్రహించారు. చంద్రబాబుకు సుప్రీం కోర్టులో (Supreme Court) న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. టీడీపీ, జనసేన పొత్తు తర్వాత వైసీపీ నేతలు పోటీకి భయపడుతున్నారన్న అచ్చెన్న.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి 160 సీట్లు పక్కా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.