స్పౌజ్ (Spouse) బదిలీల (Transfers) విషయంలో ఉపాధ్యాయులు (Teachers) పలు చోట్ల ఆందోళనకు దిగారు. హైదరాబాద్లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు ప్రయత్నించాయి. దీంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఈ రోజు మౌన దీక్ష నిర్వహించాలని ఉపాధ్యాయులు నిర్ణయించారు.
మౌన దీక్ష కోసం హాజరయ్యేందుకు విద్యాశాఖ కమిషనర్ నివాసం వద్దకు భారీగా ఉపాధ్యాయులు చేరుకున్నారు. ఉపాధ్యాయ దంపతులు, తమ పిల్లలతో కలిసి కమిషనర్ కార్యాలయం ఎదుట భైఠాయించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయుల పిల్లలు గాంధీ వేషధారణలో అక్కడకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కు భారీగా అంతరాయం కలిగింది.
దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఆ సమయంలో చిన్నారుల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
జీవో నెం 317 ద్వారా తమకు ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసిందని ఉపాధ్యాయ దంపతులు ఆరోపించారు. తాము వేరు వేరు చోట్ల విధులు నిర్వహించడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. ఆ బాధలతో తమ పిల్లలను కూడా సరిగా చూసుకోలేకపోతున్నామని వాపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.