తెలంగాణ (Telangana)లో ఎన్నికల ప్రచారం (Election Campaign) ముగిసింది. ప్రచారానికి చివరి రోజు కావడంతో మంగళవారం పార్టీలన్నీ వీలైనన్నీ సభలు నిర్వహించాయి. చివరి రోజు కావడంతో ప్రచార వేగాన్ని పెంచాయి. ఎన్నికలకు మరి కొన్ని గంటలే మిగిలి వుండటంతో పార్టీలన్నీ ఓటర్లకు వీలైనంతగా చేరువయ్యేందుకు పార్టీలు ప్రయత్నించాయి.
ఎన్నికల ప్రచారం ముగియడంతో సాయంత్రం నుంచి మైకులన్నీ మూగపోయాయి. సుమారు రెండు నెలలుగా జోరుగా తిరిగిన ప్రచార రథాలు మూలకు పడ్డాయి. ఎన్నికలకు మరి కొన్ని గంటలే మిగిలి వుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. చివరి రోజు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర పార్టీలు దూకుడు పెంచాయి.
రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టాయి. ఆయా పార్టీలకు చెందిన జాతీయ నేతలు, అగ్రనేతలు ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలో పాల్గొన్నారు. తమ పార్టీని గెలిపిస్తే ప్రజలకు అందించనున్న సంక్షేమ పథకాల గురించి ఈ సందర్బంగా మరోసారి గుర్తు చేశారు. చివరి రోజు ప్రత్యర్థులపై పార్టీలు విమర్శల దాడిని పెంచాయి.
ప్రత్యర్థి పార్టీలపై వైఖరిని ఎండగడుతూ తమ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. పలు చోట్లు స్వతంత్ర అభ్యర్థులు సైతం జోరుగా ప్రచారం చేశారు. ఎన్నికలకు మరో 48 గంటలే మిగిలి వుండటంతో ఎన్నికల కోడ్ ప్రకారం ప్రచారానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 13 నియోజక వర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగిసింది. చెన్నూరు, సిర్పూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, పినపాక, ములుగు, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో నాలుగు గంటలకే ప్రచారానికి తెరపడింది.
మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు ప్రచారం కొనసాగింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అభ్యర్థులు నేటి నుంచి ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించేందుకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్టు పోలీసు అధికారులు చెప్పారు.
ఎన్నిలకు మరికొన్ని గంటలే ఉండటంతో ప్రలోభాల పర్వం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని పార్టీలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు నిఘాను మరింత పటిష్టం చేశారు. అన్ని చోట్ల పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద తనిఖీలను చేస్తున్నారు. అటు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను సాయంత్రం 5 గంటల నుంచి మూసివేయించారు.