తెలంగాణ భవన్(Telangana Bhavan)లో హైడ్రామా నెలకొంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్(Deeksha Diwas) నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ భవన్ వద్ద దీక్షా దివస్ వేడుకలతో పాటు రక్తదాన శిబిరాన్ని పార్టీ నేతలు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలంతా తెలంగాణ భవన్‌కు చేరుకోగా ఎలక్షన్ కమిషన్(EC) అభ్యంతరం వ్యక్తం చేసింది.
‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో…’ అనే నినాదంతో 2009, నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధనకు సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షతోనే ఢిల్లీ పెద్దలు సైతం దిగొచ్చిన పరిస్థితులు అప్పుడు ఏర్పడ్డాయి. సరిగ్గా నేటితో తెలంగాణ సాధన కోసం కేసీఆర్ నిరాహార దీక్షకు దిగి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దీక్షా దివస్ కార్యక్రమం చేపట్టారు.
అయితే, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తెలంగాణ భవన్ వద్ద దీక్షా దివాస్ కార్యక్రమం చేయవద్దని ఎలక్షన్ కమిషన్ స్క్వాడ్ టీమ్ సూచించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో ఎన్నికల అధికారులతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పార్టీ లీగల్ టీమ్‌కు చెందిన సోమభరత్ సీపీతో చర్చలు జరిపారు. అనంతరం తెలంగాణ భవన్ లోపల మాత్రమే కార్యక్రమం నిర్వహించుకోవాలని, తెలంగాణ తల్లి విగ్రహానికి సైతం పూలమాల వేయవద్దని డీసీపీ తేల్చి చెప్పారు.
అధికారుల ఆదేశాలతో తెలంగాణ విగ్రహానికి పూలమాల వేయకుండానే భవన్ లోపల మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిర కార్యక్రమం ప్రారంభించి రక్తదానం చేశారు. అనంతరం దీక్షా దివస్‌పై మాట్లాడారు. ఆనాటి ఉద్యమ చైతన్యాన్ని మరొకసారి గుర్తుకు తెచ్చుకోవాలని కేటీఆర్ అన్నారు. 2009లో సీఎం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గుర్తు చేశారు.