కాంగ్రెస్ (Congress) పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక విధానం ఉందని మండిపడ్డారు. రామ మందిర ధార్మిక కార్యక్రమాన్ని బహిష్కరించడంతో హిందూ వ్యతిరేక విధానాన్ని కాంగ్రెస్ ఎలా అవలంభిస్తోందో అర్థం అవుతోందని అన్నారు. అయోధ్యకు రావడం లేదని కాంగ్రెస్ చెప్పడం రాజకీయ దృక్పథంతో తీసుకున్న నిర్ణయమన్నారు.
దేశంలో కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. హస్తం పార్టీకి ముందుంది ముసళ్ల పండగన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ….. దేశంలో రోజురోజుకూ ఆధ్యాత్మికత పెరుగుతోందన్నారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంటే కాంగ్రెస్కు కంటగింపుగా ఉందని ఆరోపణలు గుప్పించారు.
సరయూ నదిలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఆత్మలకు 22న శాంతి చేకూరుతోందన్నారు. రాముని ఉనికినే కొట్టేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఏనాడూ జాతీయ దృక్పథంతో వ్యవహరించలేదని విమర్శలు గుప్పించారు. బహిష్కరించడం ఆ పార్టీకి అలవాటైందన్నారు. జీ-20, పార్లమెంట్, అఖిల పక్షం, ఎన్నికల కమిషన్ సమావేశాలను ఆ పార్టీ బహిష్కరించిందన్నారు.
స్వాతంత్ర్యం తర్వాత హిందూ వ్యతిరేక ధోరణిని కాంగ్రెస్ ఏ విధంగా అవలంభిస్తోందో మరోసారి స్పష్టమైందని వెల్లడించారు. జనవరి 22న జరిగే ప్రారంభోత్సవం ప్రపంచంలో ఉండే హిందువులకు ఎంతో ఉద్వేగభవితమైన కార్యక్రమమన్నారు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వాస్తవాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం జరిగి బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోందని చెప్పారు.
హిందువులకు సంబంధించిన ప్రతి అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేయడమే ఆనవాయితీగా పెట్టుకుందని తీవ్రంగా ధ్వజమెత్తారు. సనాతన ధర్మం అంటే కరోనా, క్యాన్సర్తో పోల్చి దిగజారి మాట్లాడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య నుంచి వచ్చిన పూజిత అక్షింతలను పంపిణీ చేస్తుంటే రాష్ట్ర పోలీసులు అడ్డుకుని కేసులు బుక్ చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదని, కేవలం ఒక్క హైదరాబాద్లోనే ఈ దుస్థితి వచ్చిందన్నారు.