తెలంగాణ (Telangana)లో బీఆర్ఎస్ (BRS) నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప్రచారంలో ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. కానీ పంటికింద రాయిలా కాంగ్రెస్ మారిందని భావిస్తున్న బీఆర్ఎస్ ఈ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కేటీఆర్(KTR)..హరీష్ రావు (Harish Rao) విరామం లేకుండా ప్రచారాలు నిర్వహిస్తూ.. ప్రజల్లో బీఆర్ఎస్ చరిష్మా తగ్గకుండా చూసుకుంటున్నారు.
మరోవైపు కోరుట్ల నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కవిత (Kavitha).. ప్రతిపక్షాల పై విరుచుకుపడ్డారు. తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వద్దని అన్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ తో కలిసి కవిత బండలింగాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ (KCR) అధికారం చేపట్టాక గ్రామాల్లో చెరువులు నిండుకుండలా మారాయని కవిత తెలిపారు.
చెరువు ఎండిపోయినప్పుడు కప్పలు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. కానీ చేపలు మాత్రం చెరువు నిండినా ఎండినా అక్కడే ఉంటాయని తెలిపిన కవిత.. బీఆర్ఎస్ పార్టీ వాళ్లు చేపల్లాంటి వాళ్లని, కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కప్పల వంటి వాళ్లని విచిత్ర పోలికతో విమర్శించారు.. చెరువులు ఎండిన నాడు ప్రజలతో ఉన్న బీఆర్ఎస్.. చెరువులు నిండిన నాడు కూడా ప్రజలతోనే ఉందని వివరించారు.
మరోవైపు బీజేపీ గెలిచినా లాభం లేదని, బీజేపీ అభ్యర్థి గెలిచినా ఒంటి కొమ్ము సొంటికాయలా ఉంటారు కానీ అధికారంలోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వంద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని కవిత ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ మాటమీద నిలబడే పార్టీలు కాదని.. బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల బతుకులు బాగుంటాయని కవిత అన్నారు.