ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడానికి రాజకీయాల్లో పెద్దగా సమయం పట్టదని బీఆర్ఎస్ ను చూస్తే అర్థం అవుతుందని అంటున్నారు.. ప్రస్తుతం గులాబీ బాస్ మెడకు ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారం బిగుస్తుందనే చర్చ రాష్ట రాజకీయాల్లో మొదలైంది. దీనికి కారణం ప్రణీత్ రావు వ్యవహారం. బీఆర్ఎస్ (BRS) హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) డీఎస్పీ ప్రణీత్ రావు (Praneet Rao) ఆధ్వర్యంలో పలు పార్టీల నేతలు, ఇతరుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే..
ఈ కేసులో ప్రస్తుతం ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ విచారణలో ఆయన షాకింగ్ విషయాలను బయటపెడుతున్నట్లు సమాచారం. ప్రణీత్ పూర్తి స్థాయిలో గుట్టువిప్పితే కేసీఆర్ మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు గట్టిగానే చుట్టుకునే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఓటుకు నోటు కేసు అంటూ కేసీఆర్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.. ఆసమయంలో రేవంత్ ను, చంద్రబాబును గట్టిగా ఇరికించే ప్రయత్నాలు జరిగినట్లు ప్రచారం కూడా జరిగింది.
ఇక తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఎప్పటిలాగే కొన్నిరోజులు ఈ అంశంపై హడావుడి ఉంటుందని భావించారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకొనే పరిస్థితి కనిపించడం లేదు. కేసీఆర్ తన హయాంలో ప్రతిపక్ష నేతల కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారన్న ఆరోపణలున్నాయి.. ఆ సమయంలో రేవంత్ సైతం పలుసార్లు ఈ అంశాన్ని లేవనెత్తినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
ప్రస్తుతం రేవంత్ సీఎం అయిన తరువాత.. హోంశాఖను తనవద్దే ఉంచుకోవటానికి ప్రధాన కారణం పోలీస్ శాఖను సెట్‌రైట్ చేసే బాధ్యతను తీసుకోవాలన్న నిర్ణయంతోనే అంటున్నారు. ఆ క్రమంలోనే కేసీఆర్ కుటుంబానికి పోలీస్ శాఖపై ఉన్న పట్టును పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు చర్చించుకొంటున్నారు. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాపింగ్ ను వజ్రాయుధంలా వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
వారి ఆయుధాలను వాళ్ళ మీదకే ప్రయోగించడానికి పక్కాప్లాన్‌తో రేవంత్ ముందుకు వెళ్తున్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి నే కాదు.. బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ కు సైతం మాజీ సీఎం కేసీఆర్ పాల్పడినట్లు తెలుస్తోంది. బీఆర్ ఎస్ హయాంలో ఫామ్ హౌస్ లో బీజేపీలోని ప్రముఖులను డబ్బుతో పట్టుకొన్నామని కేసీఆర్ తెగ హంగామా చేసిన విషయం తెలిసిందే.
దేశంలో అన్ని రాష్ట్రాల నాయకులకు, న్యాయమూర్తులకు లేఖలు రాసి బీజేపీ తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర చేస్తే తాను పట్టుకొన్నామని అప్పట్లో కేసీఆర్ హడావుడి చేశారు. అంతేకాదు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారి ప్రధాని అవుతానని కలలు కన్నారు. కానీ, ప్రస్తుతం అడ్రస్ గల్లంతు అయ్యి అధికారం కోసం మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టారు.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాత్రం చాపకింద నీరులా అవినీతిని వెలికి తీయడానికి తన పనితాను చేసుకొంటూ పోతున్నారు.
మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని రేవంత్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే, ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఈ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు ఆమె గోలపెడితే అర్థం కాలేదు. మహేందర్ రెడ్డి అప్రూవల్ గా మారిపోతే తమ హయాంలో గుట్టుచప్పుడు కాకుండా జరిపిన వ్యవహారాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే కవిత అలా మాట్లాడినట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
మరోవైపు కేంద్రం, రాష్ట్రంలో కూడా కేసీఆర్ కు మద్దతు లేకపోవడంతో తప్పించుకొనే అవకాశంగా తనమీద కాంగ్రెస్, బీజేపీలు కలిసి పగతోనే దాడిచేస్తున్నాయని, తాను సత్తెపూసను అని జనాన్ని నమ్మించి సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే గతంలో కరవు వచ్చిన సమయంలో రైతులు పడ్డ ఇబ్బందుల వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో కరువుతో ప్రజలు అల్లాడుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, ఆ ప్రచారంతో లోక్ సభ ఎన్నికల్లో లబ్ధిపొందాలని కేసీఆర్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ప్రతిపక్షాల పతనం ఆశిస్తే తిరిగి అదే బాణం కేసీఆర్ కు తగిలిందని అంటున్నారు..