అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) బీఆర్ఎస్ (BRS) ఓటమిపై విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.. అయితే ముఖ్యంగా టీఆర్ఎస్ (TRS)గా ఉన్న పేరును, బీఆర్ఎస్ గా మార్చడం పార్టీని నష్టపరచిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ (Telangana) రాష్ట్ర సమితి అని ఉంటే మిగతా రాష్ట్రాల్లో పార్టీకి గుర్తింపు ఉండదని భావించిన గులాబీ బాస్ భారత్ పేరును పార్టీకి జోడించారు.
అనంతరం 2022-23 లో మహారాష్ట్రలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి నాందేడ్, నాగపూర్, సోలాపూర్ ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలు కూడా ప్రారంభించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించారు. ఆ సమయంలో పార్టీ పేరు మార్చడం ప్రజల సెంటిమెంట్ కు విలువ ఇవ్వడం లేదనే ఆరోపణలు వచ్చాయి.. అయినప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఇలాంటి రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకొంది.
ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడం.. బీఆర్ఎస్ ఓడటం, నేతలకు షాక్ ఇచ్చినట్టు అయ్యింది. అయితే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గత వారం రోజులుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో మెజారిటీ కార్యకర్తలు పార్టీ పేరు మార్చడం ద్వారానే ఇబ్బందులు తలెత్తయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేటీ రావు, హరీష్ రావుల ముందే కార్యకర్తలతో పాటు స్థానిక నేతలు మళ్లీ బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలని ప్రతిపాదించినట్టు సమాచారం..
కానీ కేటీఆర్ (KTR) మాత్రం పార్టీ మార్పుపై చర్చ అవసరం లేదంటూ గట్టిగానే చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నామంటూ ప్రకటించారు. మొత్తానికి ఓటమిపై ఆలోచనలో పడ్డ బీఆర్ఎస్ నేతలు.. అవినీతి పనులు, అహంకారం తగ్గించి జనానికి మేలు చేసేలా ప్రవర్తిస్తే పేరు ఏదైనా గుండెల్లో పెట్టి చూసుకోరా? అని కొందరు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.