పాక్షిక చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని ఆలయాలను(Temples in Telangana) తాత్కాలికంగా మూసివేయనున్నారు. యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో(Laxmi Narasimha Swami Temple) ఇవాళ మధ్యాహ్నం 3గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనాలకు అనుమతిస్తామని ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాయంత్రం 4గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు.
శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.05గంటల నుంచి 2.22గంటల వరకు పాక్షిక చంద్రగ్రహణం ఉందని పండితులు వివరించారు. ఈ కారణంగా తిరువాదన, నివేదన, శయనోత్సవం తదితర పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. సాయంత్రం 4 గంటలకు నృసింహుడి ప్రధానాలయంతో పాటు పాతగుట్ట టెంపుల్, అనుబంధ ఆలయాలు, ఉపాలయాలను మూసివేయనున్నట్లు చెప్పారు. ఆదివారం తెల్లవారుజామున మళ్లీ గుడి తలుపులు తెరిచి ఆలయంలో సంప్రోక్షణ పూజలు చేస్తామన్నారు. తర్వాత దర్శనాలను పునరుద్ధరిస్తామన్నారు.
అదేవిధంగా చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని శనివారం సాయంత్రం 5గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో పెద్దిరాజు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 29వ తేదీన ఉదయం 5 గంటలకు
ఆలయశుద్ధి, సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజలు చేస్తామని, 7 గంటల నుంచి భక్తులను దర్శనాలు, ఆర్జిత అభిషేకాలు, ఇతర ఆర్జిత సేవలకు అనుమతిస్తామని వివరించారు.
శ్రీశైలం మల్లన్న ఆలయంలో శనివారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాత్రమే సర్వదర్శనం చేసుకోవచ్చన్నారు. ప్రధానాలయంతో పాటు పరివార ఆలయాలు కూడా మూసివేస్తామన్నారు. భక్తులకు ఉచిత అన్నదాన వితరణ కూడా ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుందని ఈవో పేర్కొన్నారు.