ప్రత్యేక తెలంగాణ (Telangana) ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ (BRS) పాలన నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకొన్నామని అనుకొంటున్న కాంగ్రెస్.. ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు మొదలైనట్టు తెలుస్తోంది. ఇందులో ప్రభుత్వం పొరపాటు లేదని.. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకొనే ప్రయత్నంలో ఉన్నాయని పార్టీ నేతలు అంటున్నారు.. అయితే రాష్ట్రం బాగుపడాలంటే తీసుకొనే నిర్ణయాలు కొందరిని బాధిస్తాయని వెల్లడిస్తున్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడుతామని చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. జిల్లాల సంఖ్య తగ్గిస్తామని, రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపిన సీఎం.. మండలాల పునర్వ్యవస్థీకరణ సైతం చేస్తామని వ్యాఖ్యానించడం.. బీఆర్ఎస్ నేతలకు గోల్డెన్ ఛాన్స్ లా మారిందని అంటున్నారు.
కానీ రేవంత్ అభిప్రాయం మరోలా ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదనేదని భావిస్తున్న సీఎం.. జిల్లాలు, మండలాల విభజనపై బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తామని, దీనికోసం జ్యూడిషియల్ కమిషన్ నియమించి, ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించినట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అధికారం కాపాడుకోవడానికి, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి ఏదో హడావుడిగా కేసీఆర్ (KCR).. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ (Congress) నేతలు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే జిల్లాలు అతి చిన్నగా ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నట్టు పేర్కొంటున్నారు. కానీ కేటీఆర్ (KTR) ఈ విషయంలో లబ్ధి పొందేలా.. జిల్లాలను తగ్గిస్తే ప్రజలు ఒప్పుకుంటారా అని వాదించడంపై నేతలు మండిపడుతోన్నారు. మరోవైపు జిల్లాల ఏర్పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు శాస్త్రీయంగా జరగలేదు. పూర్తిగా రాజకీయ డిమాండ్లతోనే జరిగిందనే విమర్శలున్నాయి.
కృత్రిమ ఉద్యమాలు చేయించి జిల్లాలు ఏర్పాటు చేశారని, ఇప్పుడు జిల్లాలను పునర్ వ్యవస్థీకరిస్తే అలాంటి ఉద్యమాలు మళ్లీ జరిగే అవకాశం కూడా ఉందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.. అయితే ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించి ముందుకు వెళ్ళితే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతోన్నారు.