కరీంనగర్ జిల్లా(Karimnagar District) మానకొండుర్(Manakondur)లో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం 4గంటలకు మానకొండూర్ మండల కేంద్రంలోని చెరువు కట్ట వద్ద స్థానికులు ఎలుగుబంటిని చూశారు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న హనుమాన్ ఆలయం సమీపంలో ఓ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. వీధి కుక్కలు తరమడంతో కరీంనగర్, వరంగల్ రహదారి వైపు పరిగెత్తింది. పక్కన ఉన్న వేప చెట్టుపై ఎలుగుబంటి ఎక్కడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు స్థానికులను అప్రమత్తం చేసి పరిసర ప్రాంతాల్లో ప్రజలు రాకుండా జాగ్రత్త వహించారు. అనంతరం అటవీశాఖ అధికారులు సమాచారమిచ్చారు. ఈ మేరకు వరంగల్‌లోని రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. దాదాపు పది గంటల పాటు ఎలుగుబంటి ముప్పుతిప్పలు పెట్టింది.
తొలుత ఎలుగుబంటి బరువు ఎక్కువగా ఉండడంతో వలలో చిక్కడం కష్టంగా ఉంటుందని అటవీశాఖ అధికారులు భావించారు. దీంతో ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎట్టకేలకు బంధించారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే, గతంలో అన్నారం ఈదులగట్టుల పల్లిలో స్థానిక ప్రజలపై ఎలుగుబంటి దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి.