శివరాత్రి వెళ్ళింది.. ఎండలు సైతం తమ ప్రతాపం చూపిస్తున్నాయి. మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. అప్పుడే పూర్తి వేసవి (Summer)ని మరిపించేలా ఉక్కబోత కూడా మొదలైంది. మార్చి మొదటి వారంలోనే వేడి విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాలలో నిన్న పగటి ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి.
మరోవైపు ఇదే సమయంలో గత ఏడాది 35 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉన్నాయి. కానీ ఈసారి వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. అదేవిధంగా ఏపీలోని పశ్చిమ, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా నమోదు అవుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో మార్చి నుంచి మే వరకు కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
గత ఏడాది కంటే వేడి తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. మార్చి నుంచి మే వరకు జమ్మూకశ్మీర్, తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాల్లో వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావం వల్ల గత వర్షాకాలంలో ఎక్కువగా వానలు కురవలేదు.
ఎప్పుడూ చూడని పరిస్థితి 2023 ఆగస్టులో నెలకొంది. గత డిసెంబర్-జనవరిలోనూ వర్షాలు పడలేదు. అంతేకాదు శీతాకాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా నమోదైంది. అయితే ఏప్రిల్ (April) నాటికి ఎల్ నినో ప్రభావం తగ్గనుందని ఏఎన్వోఏఏసీపీసీ (ANOVAACPC) తెలిపింది.