ఇంట్లో డబ్బు దాచుకుంటే దొంగల భయం, పోని బ్యాంకు లాకరులో (Bank Locker) దాచుకుందామంటే ఇప్పుడు చెదల (Termites) భయం. ఓ మహిళ బ్యాంక్ లాకర్లు దాచిన రూ. 18 లక్షలకు చెదలు పట్టాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ (Uttara Pradesh) లో జరిగింది. ఈ డబ్బు ఆ మహిళ కుమార్తె వివాహ సందర్భంగా వచ్చిన కానుకలు కావడం విశేషం.
మొరాదాబాద్ లో నివాసం ఉంటున్న అల్కా పాఠక్, పరుపుల వ్యాపారం చేస్తారు. ఆమెకు బ్యాంక్ ఆఫ్ బరోడా రామగంగా విహార్ బ్రాంచ్ లో లాకర్ తీసుకుంది. గతేడాది అక్టోబర్ నెలలో అల్కా తన కుమర్తె వివాహ సందర్భంగా కానుకల రూపంలో వచ్చిన రూ. 18 లక్షల డబ్బును బ్యాంక్ లాకర్ లో భద్రపరిచారు. నగదుతో పాటు విలువైన నగలను ఆ లాకర్లో ఉంచారు.
అయితే సెప్టెంబర్ 25వ తేదీన కేవైసీ, లాకర్ అగ్రిమెంట్ రెన్యువల్ కోసం అల్కా.. బ్యాంక్కు వెళ్లారు. ఆ సమయంలో లాకర్ ను తెరిచి చూడగా…ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు అల్కా. నోట్లన్నింటినీ చెదలు తినేసి…డబ్బుంతా చిత్తు కాగితాల్లా మారిపోయాయి. రూ. 18 లక్షలు కూడా నల్లని మసితో ముక్కలుగా పడి ఉన్నాయి.
నగలు మాత్రం భద్రంగానే ఉన్నట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు. కేసును విచారిస్తున్నట్లు ఆయన చెప్పారు. బ్యాంక్ లాకరులో డబ్బులు పెట్టకూడదని విషయం తనకు తెలియదని అల్కా చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్ లో కూడా ఇలాగే బ్యాంక్ లాకర్ పెట్టిన రూ. 2.15 లక్షలను చెద పురుగులు తినేశాయి.