టీం ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ex Cricketer Ambati Rayudu) కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్లో విశేష సేవలందించిన ఈ తెలుగు క్రికెటర్.. తన రిటైర్మెంట్ అనంతరం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. తొలుత రాయుడు ఏపీలోని అధికార వైసీపీ(YCP) పార్టీలో చేరారు.
కేవలం నెలరోజుల వ్యవధిలోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) జనసేన(Janasena) పార్టీలో చేరడంతో అటు వైసీపీ శ్రేణులు, పార్టీ కీలక నేతలు సైతం షాక్ అయ్యారు.పవన్ కళ్యాణ్ విజన్ ఉన్న నాయకుడు అని, అతని ఆదర్శాలు నచ్చి జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు సరైన పార్టీకి ఓట్లేసి తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల వేళ అంబటి రాయుడు జనసేన పార్టీ తరఫున తెనాలీలో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కూటమి అభ్యర్థులు రాయుడు వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆధిప్యత ధోరణి, రాచరికాన్ని చూసి అందులో ఉండలేకపోయానని అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో ఆ పార్టీలో చేరాను. కానీ అక్కడి వాతావరణం చూశాక ప్రజాసేవకు సరైన వేదిక కాదు అనిపించింది.అందుకే వెంటనే పార్టీని వీడాను. పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఆశయాలు నాకు బాగా నచ్చాయి.ప్రజలందరూ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి’ అని అంబటి రాయుడు పిలుపునిచ్చారు.