తెలంగాణ (Telangana) రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి.. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో గులాబీ బాస్ కీలక నిర్ణయాలు తీసుకొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కడియం శ్రీహరి విషయంలో ఆగ్రహంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం నిలబడితే.. ఆయనకు పోటీగా తాటికొండ రాజయ్యను బరిలో దింపాలనే భావనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ (BRS) వరంగల్ ఎంపీ టికెట్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.. అయితే అనూహ్యంగా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి బీఆర్ఎస్ కు షాకిచ్చింది. అసలే కీలక నేతలంతా పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఇలాంటి సమయంలో కడియం కావ్య నిర్ణయం కేసీఆర్ కు గుదిబండలా మారింది.
దీంతో కడియం ఓటమి లక్ష్యంగా బీఆర్ఎస్ అధిష్ఠానం వ్యూహాలు పన్నుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు ప్రారంభం అయ్యాయి.. ఎలాగైన ఆయనకు బుద్ధి చెప్పాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah)ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పెద్దాయన నుంచి నేడు పిలుపు అందుకొన్న ఆయన.. ఎర్రవెల్లిలోని కేసీఆర్ (KCR) ఫామ్‌హౌజ్‌కు వెళ్ళినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకు స్టేషన్ ఘన్పూర్ టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యని కాదని కడియం శ్రీహరికి టికెట్ కేటాయించారు. ఆ సమయంలో పార్టీపై అలిగిన రాజయ్య.. ఇటీవలే బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. అయితే ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు. కాగా తాజాగా కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభిస్తే మళ్లీ బీఆర్ఎస్లో చేరి వరంగల్ అభ్యర్థిగా బరిలో ఉంటారని టాక్ వినిపిస్తోంది..