సిద్దిపేట (Siddipet) జిల్లా గజ్వేల్ (Ghazwal) మండలంలో దారుణ ఘటన చోటుచేసుకోంది. వ్యవసాయ పనుల కోసం వెళ్లిన తండ్రి, కుమారుడు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. జాలిగామా (Jaligama) గ్రామంలో నివసిస్తున్న కుమ్మరి కనకయ్య (50) ఆదివారం ఉదయాన్నే పొలం పనుల నిమిత్తం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు.
ఆ పొలంలో కరెంట్ తీగలు తెగి పడిన విషయాన్ని గమనించని కనకయ్య వాటి మీద కాలు వేయడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. పొలం పనుల కోసం వెళ్లిన తన తండ్రి ఇంకా ఇంటికి రావడం లేదని ఇద్దరు కుమారులు పొలానికి వెళ్ళి వెతకసాగారు.
ఈ క్రమంలో పెద్ద కుమారుడు భాస్కర్ (28) కూడా తనతో ఉన్న కుక్కతో సహా కరెంట్ షాక్ తగిలి మరణించారు. భాస్కర్ అరుపు విన్న తమ్ముడు అనుమానంతో ప్రక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ను ఆపి వెళ్లి చూడగా తండ్రి కనకయ్య, అన్న భాస్కర్ విగత జీవులుగా కనిపించారు. కాగా ఈ ఘటనతో జాలిగామా గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి, మరోవైపు విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.