సన్యాసులు (Sanyasi) అంటే సర్వ సంగ పరిత్యాగులు. అరిషడ్వర్గాలను జయించి ఆధ్యాత్మిక (Spiritual) ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. ఎప్పుడూ శాంతి యుతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ అలాంటి సన్యాసులు సైతం ఓ సారి తుపాకులు పట్టారు. బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసి స్వతంత్ర్య పోరాటానికి బీజం వేశారు. ఎంతో మందిని స్వాతంత్ర్య ఉద్యమం వైపు కార్యోన్ముఖులను చేశారు.
దేశంలో తీర్థయాత్రలకు వెళ్లేందుకు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సన్యాసులకు జమీందార్లు, సంపన్న వర్గాల వాళ్లు విరాళాలు ఇచ్చే వారు. ఆ విరాళాలతో సన్యాసులు తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేసుకునే వారు. కానీ దేశానికి బ్రిటీష్ వారు వచ్చిన తర్వాత ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ముఖ్యంగా దేశంలో అన్ని వర్గాల వారిపై బ్రిటీష్ పాలకులు అధిక పన్నులు వేసే వాళ్లు.
అధిక పన్నులు విధించడం, కరువు కాటకాలు రావడం, విదేశీ వస్తువుల వినియోగం పెరగడం, స్వదేశీ కుటీర పరిశ్రమలు మూలపడటంతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి చాలా వరకు జమీందార్లు, సంపన్న వర్గాల వాళ్లు విరాళాలు ఇవ్వడం మానేశారు. ఈ క్రమంలో సన్యాసుల తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆగిపోయాయి.
మరోవైపు 1777లో ఎలాంటి కారణం లేకుండానే సుమారు 150 మంది సన్యాసులకు బ్రిటీష్ ప్రభుత్వం మరణ శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ వారికి సన్యాసులు ఎదురు తిరిగారు. పండిట్ భవానీ చరన్ పాధక్ నేతృత్వంలో సన్యాసులు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దేశంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన మొదటి ప్రజా తిరుగుబాటు ఇదే కావడం విశేషం.
ఈ క్రమంలో సన్యాసులు పంప్రదాయ ఆయుధాలైన విల్లు, బాణాలు, కత్తులను చేతబట్టి బ్రిటీష్ వారిపై పోరాటం చేశారు. బ్రిటీష్ సైన్యంపై ఎక్కడికక్కడ గెరిల్లా దాడులు చేశారు. బ్రిటీష్ వారి నుంచి సన్యాసులు పలు ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. సన్యాసుల తిరుగుబాటు తీవ్ర తరం అవుతున్న సందర్బంలో దాన్ని ఎలాగైనా అణచి వేయాలనుకున్నారు. కుట్రలు చేసి చివరకు ఆ తిరుగుబాటును అణచి వేశారు.