భారత్ (India), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య నేడు ధర్మశాలలో ఐదో టెస్ట్, తొలిరోజు భారత స్పిన్నర్లు విజృంభించారు. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్లు 218 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. ఇక ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగుల వెనుకంజలో ఉంది. మరోవైపు కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) తొలి రోజే ఇంగ్లాండ్‌ను కుప్పకూల్చారు. ఏకంగా ఐదు వికెట్లు తీసి ఆ జట్టు పతనంలో కీలకంగా వ్యవహరించాడు.
బౌలింగ్ లో నిప్పులు చెరిగేలా విజృంభించిన కుల్దీప్ 15 ఓవర్లలో 72 పరుగులు ఇచ్చి 5 వికెట్లు దక్కించుకొన్నారు. ఇదిలా ఉండగా మొదట ఇంగ్లాండ్‌కు మంచి ఆరంభమే దక్కింది. కానీ, రెండో సెషన్ నుంచి భారత్ బౌలర్లు ఫామ్ లోకి రావడం.. ఆ జట్టును కోలుకోలేని విధంగా నష్టపరిచింది. మంచి ఫామ్‌లో ఉన్నట్టు కనిపించిన జాక్ క్రాలీని (79 పరుగులు) కుల్దీప్ యదవ్ బౌల్డ్ చేశాడు.
అదీగాక వరుసగా.. బెన్ డకెట్, ఓలీ పోప్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్‌లను పెవిలియన్‌కు పంపించాడు.. దీంతో ఇంగ్లండ్ జట్టు చిక్కుల్లో పడింది.. అదేవిధంగా కెరీర్లోనే మైలురాయి అయిన 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కూడా 4 వికెట్లు పడగొట్టాడు. అలా ఈ ఇద్దరి స్పిన్ మాయాజాలానికి ఇంగ్లాండ్ చతికిలపడింది. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కించుకున్నాడు.
ఇంగ్లాండ్ ప్లేయర్స్‌లో ఓపెనర్ జాక్ క్రాలీ 79 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బెన్ డకెట్ (27 పరుగులు), జోరూట్(26 పరుగులు), జానీ బెయిర్ స్టో(29 పరుగులు) చేశారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో పాటు మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ కూడా డకౌట్ అయ్యారు. మరోవైపు భారత ఆటగాళ్లలో అతి తక్కువ టెస్టు మ్యాచుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా జైస్వాల్ (Jaiswal) చరిత్ర సృష్టించాడు. కేవలం తొమ్మిది టెస్టు మ్యాచుల్లోనే ఈ ఘనత అందుకొన్నారు.