15వ శతాబ్దం చరిత్ర గురించి ఏ పుస్తకంలో వెతికినా మొఘలు (Mughals) ల చారిత్రాక విజయాలు, వారి వైభవం గురించే కనిపిస్తుంది. ముఖ్యంగా వారి యుద్ద పటిమను వివరించే పానిపట్ , గోగ్రా, కనోజ్ యుద్దాలు మాత్రమే కనిపిస్తాయి. ఢిల్లీ సుల్తానేట్ అంటే మొఘలు… మొఘలులు అంటే ఢిల్లీ సుల్తానేట్ అన్నట్టుగా చరిత్రలో కనిపిస్తుంది. కానీ మొఘలులపై పోరాడి ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించిన హిందూ చక్రవర్తి హేము (Hemu) గురించి మాత్రం ఎక్కడా కనిపించదు.
హేమా చంద్ర విక్రమాదిత్య (హేము) ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. ఓ చిన్న వ్యాపారిగా జీవితం ప్రారంభించారు. షేర్ షా సూర్ కాలం నాటికి మార్కెట్ పై అధికారిగా ఎదిగారు. వాణిజ్య విషయాల్లో షేర్ షాను తరుచూ కలుస్తూ అతి తక్కువ కాలంలోనే చక్రవర్తి దగ్గర హేమూ మంచి నమ్మకస్తునిగా పేరు తెచ్చుకున్నారు. షేర్ షా సూరీ మరణం తర్వాత ఇస్లాం షాకు హేమూ మరింత దగ్గరయ్యాడు.
కేవలం వాణిజ్య విషయాల్లోనే కాకుండా సైన్యం, రాజకీయాలకు సంబంధించిన అంశాల్లో ఇస్లాం షాకు అద్బుతమైన సలహాలు ఇస్తూ సూర్ రాజ్య విస్తరణలో కీలక పాత్ర పోషించారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ చివరకు ప్రధాని స్థాయి వరకు చేరుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అదిల్ షా మద్యానికి బానిస కావడంతో పాలన మొత్తాన్ని హేము దగ్గర ఉండి చూసుకున్నారు.
అదిల్ షా సూరి బలహీనమైన చక్రవర్తి కావడంతో పన్ను చెల్లించేందుకు అప్ఘన్ గవర్నర్లు నిరాకరించారు. దీంతో వారిపై హేము దండెత్తి వారిని అణిచి వేశాడు. ఆ తర్వాత 1556లో అక్బర్ సేనలను ఓడించి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించి చక్రవర్తిగా ప్రకటించారు. దీంతో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన చివరి హిందూ రాజుగా హేము చరిత్ర సృష్టించారు.