బాలీవుడ్ క్వీన్‌గా పేరొందిన నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం బీజేపీ(BJP) పార్టీలో కొనసాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తను ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్నారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కంగనా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ప్రస్తుతం కంగనా ఎన్నికల ప్రచారంలో బిజీగా మారిపోయారు. తన సొంత నియోజకవర్గం మండితో పాటు వివిధ ప్రాంతాల్లోనూ బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఆమె ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్(Jodhpur) బీజేపీ ఎంపీ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెకావత్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించింది.
సంప్రదాయ రాజస్థానీ తలపాగా ధరించి కంగనా జోధ్ పూర్లో మెగా రోడ్ షోను నిర్వహించింది. దీనికి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఇక ఆ ప్రాంతం అంతా ‘భారత్ మాతాకీ జై’.. ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తింది.
ఈ సందర్బంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ.. దేశంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, ప్రజల్లో బీజేపీపై ప్రేమ కనిపిస్తోందన్నారు.జోధ్‌పూర్ ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉందన్నారు. దేశంలో ఇప్పటికే కాషాయ అలలు ఉప్పొంగుతున్నాయని.. అవి అలాగే కొనసాగుతాయని పేర్కొంది. అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.తనపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రీయా సులే చేసిన విమర్శలను సైతం ఈ సందర్భంగా కంగనా ప్రస్తావించారు.తనలో కూడా రాజస్థాన్ డీఎన్ఏ ఉందని ఓటర్లకు వివరించారు.