తెలంగాణలో ఎండలు(Summer Heat) దంచికొడుతున్నాయి. రోజురోజుకూ వడగాల్పులు (Heat Waves) తీవ్రతరం అవుతుండటంతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. వడగాల్పులు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అత్యవసరం అయితే తప్పా ఎవరూ బయటకు రావొద్దని, ప్రయాణాలు మానుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రం(TELANGANA)లోని పలు జిల్లాలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది.రేపు, ఎల్లుండి సూర్యుడి తాపం మరింత పెరిగే చాన్స్ ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా వాటర్ బాటిల్, స్కార్ఫ్, గొడుగు, క్యాప్ వంటివి క్యారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు సరిపడా వాటర్ తీసుకోవాలని పేర్కొన్నారు. ఇదిలాఉండగా తెలంగాణలోని ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైనే ఉష్టోగ్రతలు నమోదైనట్లు తెలుస్తోంది.
అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగుల పల్లిలో 45.04 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత మంచిర్యాల, రామగుండం, మెదక్ , ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో టెంపరేచర్ మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీచేసింది. అయితే, వడదెబ్బ కారణంగా మెదక్ జిల్లాలో ఆదివారం ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.