హైదరాబాద్(Hyderabad)లో రోజురోజుకు మోసాలు, దోపిడీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల చైన్ స్నాచింగ్ కేసులు(Chin Snatching Cases) ఎక్కువయ్యాయి. దుండగులు ఒంటరిగా వెళ్లేవారిపై మూకుమ్మడిగా దాడిచేసి నిలువు దోపిడి చేస్తున్నారు. ముఖ్యంగా దొంగలు ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటుండటంతో పోలీసులకు సవాల్‌గా మారింది. తాజాగా రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ఇలాంటి ఘటనే కలకలం రేపింది.
కోకాపేటలో ఓవ్యక్తి ఆటో కోసం ఎదురు చూస్తుండగా ఓ దుండగుడు అతడి వద్దకు వెళ్లాడు. మెళ్లిగా మాటలు కలుపుతూ అతడిపై దాడి చేశాడు. దొంగలు ఆ వ్యక్తిని ఆటోలో ఎక్కించుకుని అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. బాధితుడి వద్ద నుంచి నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బులేదని ఎంత వారించినా దుండగులు వినిపించుకోలేదు. మూకుమ్మడి దాడి చేసి అతడి జేబులో ఉన్న రూ.4,500 తీసుకుని ఆటోవదిలి పారిపోయారు. దీంతో బాధితుడు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చినట్లు గుర్తించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కోకాపేట సర్వీస్ రోడ్డులో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇది వరుసగా ఐదో ఘటన కావడం గమనార్హం. దోపిడీ ముఠాలు ఒంటరి వారినే టార్గెట్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. కోకాపేట వైపు వెళ్లే ప్రయాణికులు, వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అపరచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు. మరోవైపు యాదాద్రి జిల్లాలో రాత్రిపూట వరుస చోరీలు జరుగుతున్నాయి.
భువనగిరి మున్సిపాలిటీ రాయగిరిలో ఇద్దరు మహిళల మెడలో నుంచి పుస్తెలతాడులు చోరీచేశారు. డాబాలపై, ఆరుబయట నిద్రిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. చోరీ తర్వాత పుస్తెలను వదిలి గొలుసును మాత్రమే దొంగలు తీసుకెళ్తున్నారు. బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. యాదాద్రిలో ఇలా దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకుని దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు.