– ప్రభుత్వంలో కీలక మార్పు జరగనుందా?
– త్వరలో డిప్యూటీ సీఎం మార్పు ఉండనుందా?
– ఒకవేళ భట్టిని తప్పిస్తే ఆ స్థానంలోకి నెక్స్ట్ ఎవరు..?
– రేసులో దామోదర రాజనర్సింహ, వివేక్
– రేవంత్ ఢిల్లీ టూర్ లో దీనిపై చర్చ జరిగిందా..?
– రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ
తెలంగాణ ప్రభుత్వంలో కీలక మార్పు ఉండనుందని విశ్వసనీయ సమాచారం. డిప్యూటీ సీఎం భట్టిని పదవి నుంచి తొలగించే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే బలమైన మరో దళిత నాయకుడికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నట్టు టాక్. ఇదే నిజమైతే, భట్టి నిర్ణయం ఎలా ఉంటుంది..? రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్, పార్టీ పెద్దలతో భేటీ సందర్భంగా దీనిపైనే చర్చ జరిగినట్టు సమాచారం.
భట్టి తీరుపై అధిష్టానం ఆగ్రహంతో ఉందా?
ఈ మధ్య యాదాద్రి టూర్ సందర్భంగా భట్టి చుట్టూ వివాదం నెలకొనగా ఆయన స్పందించారు. ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నానని అన్నారు. ఎవరికీ తలవంచే వాడిని కాదని.. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని అసలికే కాదని చెప్పారు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదంటూ మాట్లాడారు భట్టి. ఈ వ్యాఖ్యలపై భిన్న వాదనలు జరిగాయి. అధికారం దక్కాక భట్టి ఎవరినీ లెక్క చేయడం లేదనే ప్రచారం జరిగింది. పైగా, ఢిల్లీ పెద్దలను కూడా లెక్క చేయడం లేదనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను డిప్యూటీ సీఎం పదవి నుంచి మార్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
రేవంత్ ఢిల్లీ టూర్ లో క్లారిటీ
సీడబ్ల్యూసీ మీటింగ్ లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అక్కడ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా వంద రోజుల పాలన, గ్యారెంటీల అమలుపై వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, పార్టీ బలోపేతం, నేతల చేరికలపైనా రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్లు సమాచారం. లోక్ సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారాలపై అధిష్టానంతో మాట్లాడారు. అలాగే, భట్టి అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం మార్పుపై వీరు మాట్లాడుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
రేసులో వివేక్, రాజనర్సింహ.. భట్టి సంగతేంటి..?
భట్టిని డిప్యూటీ సీఎంగా తప్పిస్తే, అంత బలమైన లీడర్ ఎవరనే దానిపైనా అగ్ర నేతలు చర్చించినట్టు సమాచారం. ఈ లెక్కన చూస్తే, రేసులో దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరిలో ఒకరిని డిప్యూటీ సీఎంని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే, వీర విధేయుడని ముద్ర వేసుకున్న భట్టి సంగతేంటనేది ఇప్పుడు ప్రశ్న. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ డిప్యూటీ సీఎం మార్పు ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం.