త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections).. తెలంగాణ (Telangana) బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా 17 లోక్‌సభ స్థానాలకు ఇన్ఛార్జులను నియమించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీకి ఇన్‌ఛార్జులుగా అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తయారు చేసిన ఈ లిస్టులో, సీనియర్ నాయకులు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, మురళీధర్‌రావు లాంటి వాళ్లు ఎవరూ లేకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు కిషన్‌రెడ్డి అధ్యక్షతన లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రెండు రోజుల పాటు సమావేశాలు జరిగాయి. బీజేపీ (BJP)కి ప్రస్తుతం రాష్ట్రంలో నలుగురు ఎంపీలున్నారు. తెలంగాణలో పార్టీ బలపడాలంటే వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని హైకమాండ్ టార్గెట్ పెట్టింది. ఆ దిశగా ముందుకు వెళ్లాలని సూచించినట్టు తెలుస్తోంది. జనంలోకి కేంద్రప్రభుత్వ పథకాలను తీసుకెళ్లి.. ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ఏం చేయాలనే అంశాలపై పార్టీ పెద్దలు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. కిషన్ రెడ్డి తప్ప మిగిలిన ముగ్గురూ ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓడిపోయారు. తాము ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోని ఒక సెగ్మెంటులో పోటీచేసి నెగ్గలేకపోయిన వారు.. మొత్తం ఏడు సెగ్మెంట్ల ప్రజల ఆదరణ ఎలా పొందగలరు? ఎలా మళ్లీ ఎంపీగా నెగ్గగలరు? అనే సందేహం లేవనెత్తుతున్నారు.. మరోవైపు కాంగ్రెస్ (Congress) గత పార్లమెంటు ఎన్నికల సమయానికి ఉన్నంత బలహీన స్థితిలో ఇప్పుడు లేదు. పైగా అధికారంలో ఉంది. ఖచ్చితంగా వారికి కొన్ని ఎడ్వాంటేజీలు ఉంటాయి.
అదే సమయంలో బీఆర్ఎస్ (BRS) తీరు సైతం బీజేపీకి కొరకరాని కొయ్యగా మారావచ్చని అంటున్నారు.. ఓటమి వల్ల పోయిన పరువు నిలబెట్టుకోవాలంటే ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో పదికి పైగా సీట్లు గెలవాలని కాషాయం ఆశపడడం తప్పు కాదుగానీ, ఉన్నవి నిలబెట్టుకోగలరా? అనే సందేహాలున్నాయి. ఇక ఏదైతే అది జరగని అనే ధీమాతో ముందుకు వెళ్తున్న బీజేపీ.. హైదరాబాద్ స్థానానికి ఇంఛార్జీగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బాధ్యతలు అప్పగించింది.
ఆదిలాబాద్-పాయక్ శంకర్.. పెద్దపల్లి-రామారావు పాటిల్.. కరీంనగర్-ధనపాల్ సూర్యనారాయణ గుప్తా.. నిజామాబాద్-ఏలేటి మహేశ్వరరెడ్డి.. జహీరాబాద్-కాటిపల్లి వెంకటరమణరెడ్డి.. మెదక్-పాల్వాయి హరీష్ బాబు.. మల్కాజ్గిరి-పైడి రాకేష్ రెడ్డి.. సికింద్రాబాద్-కే.లక్ష్మణ్.. చేవెళ్ళ-ఏవీఎన్ రెడ్డి.. మహబూబ్‌నగర్-రామచంద్రరావు.. నాగర్‌కర్నూల్-మాగం రంగారెడ్డి.. నల్లగొండ-చింతల రామచంద్రారెడ్డి.. భువనగిరి-ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. వరంగల్-మర్రి శశిధరరెడ్డి.. మహబూబాబాద్-గరికపాటి మోహనరావు.. ఖమ్మం-పొంగులేటి సుధాకర్ రెడ్డి మొదలగు వీరిని ప్రకటించింది.