కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageshwar rao) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లేనని సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. తెలుగు గడ్డమీద పచ్చ జెండా ఎగరాలి అనేదే తన ఆలోచన అని చెప్పారు.
‘ఏపీ నుంచి వచ్చి మీరు నాకు చేస్తున్న సాయం నేను ఉంచుకోను.. తెలుగు దేశం పార్టీకి నేను చాలా రుణపడి ఉన్నా.. ఖమ్మం నియోజకవర్గంలో నన్ను, పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఓడించేందుకు భారత రాష్ట్ర సమితి(BRS) వందల కోట్లు ఖర్చు చేస్తోంది’ అంటూ తుమ్మల నాగేశ్వరరావు ఆరోపణలు చేశారు.
అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ ఉందని.. కోట్లు కుమ్మరించి తమ నాయకులు అలాగే కార్యకర్తలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ అరాచకాలు అన్నిటికీ చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అఫిడవిట్ నిబంధనలకు అనుగుణంగా లేదని తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు పువ్వాడ అజయ్ నామినేషన్‌పై రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్‌ను తిరస్కరించాలని ఆయన కోరారు.