చైనా(China) యాప్ టిక్-టాక్(TikTok)ను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. 2020లో చైనాతో సంబంధాలు క్షీణించిన తర్వాత భారత ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు అదే బాటలో అమెరికా వెళ్తోంది. అమెరికా పార్లమెంట్ ఎంపీలు మంగళవారం సమర్పించిన బిల్లులో చైనా కంపెనీ యాప్ టిక్‌టాక్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు.
‘ఈ యాప్ దేశ జాతీయ భద్రతకు ముప్పుగా అభివర్ణించబడింది. అదేవిధంగా ది ప్రొటెక్టింగ్ అమెరికన్స్ ఫ్రమ్ ఫారిన్ అడ్వర్సరీ కంట్రోల్డ్ అప్లికేషన్స్ యాక్ట్’లో, కంపెనీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు కలిగి ఉందని ఆరోపించింది. హౌస్ సెలెక్ట్ కమిటీ ఛైర్మన్, చట్టం రచయితలలో ఒకరైన మైక్ గల్లాఘర్ ఒక పత్రికా ప్రకటనలో కంపెనీని హెచ్చరించారు.
టిక్‌టాక్‌కు ఇది నా సందేశమని తెలుపుతూ.. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(CCP)తో సంబంధాలను తెంచుకోండి లేదా మీ అమెరికా వ్యాపారాన్ని మూసివేయండని సూచించాడు.. అమెరికాలోని ప్రధాన మీడియా ప్లాట్ ఫారమ్‌ను నియంత్రించే హక్కును అమెరికా శత్రువుకి మేము ఇవ్వలేమని కూడా ఆయన అన్నారు. సమర్పించిన బిల్లులో టిక్ టాక్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
బిల్లును ప్రవేశపెట్టిన చట్టసభ సభ్యులలో ఒకరైన కృష్ణమూర్తి మాట్లాడుతూ, “అది రష్యా లేదా CCP అయినా ప్రమాదకరమైన యాప్‌లను అణిచివేసేందుకు, మన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా అమెరికన్ల భద్రత, గోప్యతను రక్షించే అధికారం అధ్యక్షుడికి ఉందని ఈ బిల్లు నిర్ధారిస్తుంది.” అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే యాపిల్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగిస్తారు.