తిరుమల (Thirumala) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు (Navaratri Brahmotsavam) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజైన గురువారం ఉదయం మోహినీ అవతారం (Mohini Avataram)లో శ్రీవారి దర్శనం జరుగుతుంది. మరోవైపు గురువారం గరుడోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను రద్దు చేశారు. 4000 మంది పోలీసులు, 1000 మంది టీటీడీ సిబ్బందితో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
గరుడోత్సవంలో స్వామి వారి అలంకరణ ప్రత్యేకంగా మారింది. లక్ష్మీకాసులహారం, సహస్రనామ కాసుల హారం, నిత్యం మూలమూర్తికి అలంకరణలో ఉండే ఆభరణాలు గర్భాలయం దాటి వెలు పలికి రానున్నాయి. కాగా గ్యాలరీలో రెండు లక్షల మందికి స్వామి వారి సేవలు వీక్షించే విధంగా ఏర్పాటు చేశారు. రద్దీ ఎక్కువ అయితే అందరికీ గరుడోత్సవ దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేక క్యూలైన్ ద్వారా వెలుపల ఉన్నవారికి కూడా గరుడ వాహన దర్శనం కలిగేలా ఏర్పాటు చేసింది టీటీడీ.
మరోవైపు వాహన సేవలకు వచ్చే భక్తులకు ఆహారం వితరణ కూడా ఏర్పాటు చేశారు.. గురువారం రాత్రి 12 గంటలకు వరకు అన్న ప్రసాద కేంద్రంలో అన్నదాన కార్యక్రమం ఉంటుందని టీటీడీ తెలిపింది.. మరోవైపు భక్తుల రద్దీ కారణంగా అరగంట ముందు గరుడోత్సవం ప్రారంభం కానుంది. అంటే సాయంత్రం 6.30 గంటలకే గరుడోత్సవం ప్రారంభం కానుంది.
ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనాలు, సర్వ దర్శనం టోకెన్లు టీటీడీ అధికారులు రద్దు చేశారు. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా పల్లకీ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న శ్రీవారిని దర్శించాలంటే భక్తులకు రెండు కళ్ళు సరిపోవనిపిస్తోంది…