స్వాతంత్ర్య సమరం జరుగుతున్న కాలంలో ఎంతో మంది భారతీయులు తమ ప్రాణాలను త్యాగం చేసి ‘భారత మాత’ బానిస సంకెళ్లను తెంచడానికి ఉరికొయ్యలకు వేలాడారు. అందుకోసం కన్నతల్లిదండ్రులను, ఉన్న ఊరిని వదిలేసి ఉద్యమానికి ఊపిరిలూదడానికి బయలుదేరారు.అలాంటి నిజమైన దేశభక్తుల్లో ఒకరు ‘షహీద్ పీర్ అలీఖాన్’.
1812లో ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలోని మహమ్మద్ పూర్లో జన్మించిన పీర్ అలీఖాన్(Peer Alikhan)..తన ఏడేళ్ల వయసులోనే ఇంటి నుంచి ప్రస్తుత బిహార్ రాష్ట్రంలోని పాట్నాకు వలస వెళ్లాడు. అక్కడ ఓ జమీందార్ అతనికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు బిడ్డలా సాకాడు.అలీ పెద్దయ్యాక పాట్నాలోనే ఓ పుస్తకం దుకాణాన్ని ప్రారంభించాడు. ఇది 1857లో సిపాయిల తిరుగుబాటు సమయంలో విప్లవకారులు అందులో రహస్యంగా మీట్ అయ్యేవారని విలయం టేలర్ అనే బ్రిటీష్ అధికారి తన పుస్తకంలో రాసుకొచ్చాడు.
విలియం టేలర్.. పాట్నా డివిజన్ కమిషనర్(1855-1857)గా పనిచేశాడు. తన పుస్తకంలో ఏం రాశాడంటే.. ‘పీర్ అలీ లక్నోకు చెందినవాడు, కానీ చాలా ఏళ్లుగా పాట్నాలో ఉంటున్నాడు. పుస్తక విక్రయదారుడు పనిచేస్తూనే, తిరుగుబాటు సమయంలో తిరుగుబాటు కుట్రలను కొనసాగించే ఉద్దేశంతో అతను వాస్తవానికి ఇక్కడ స్థిరపడి ఉండవచ్చని నేను గట్టిగా అనుమానిస్తున్నాను’అని పేర్కొన్నాడు.
షహీద్ పీర్ అలీ ఖాన్ భయం లేని వ్యక్తి. జులై 1857లో పాట్నాలో జరిగిన తిరుగుబాటు ఉద్యమానికి అలీ నాయకుడిగా అవతరించాడు. అంతేకాకుండా అతను రహస్యంగా ముఖ్యమైన కరపత్రాలు పంపిణీ చేశాడు. ఇతర విప్లవకారులకు కోడెడ్ సందేశాలను కూడా పంపాడు. వలసవాద వ్యతిరేక నిరసనలను ప్లాన్ చేయడానికి విప్లవకారుల మధ్య అన్ని సంభాషణలను సేకరించేవాడు.
ఈ క్రమంలోనే బ్రిటీష్ అధికారుల చేతికి రెండు లేఖలు దొరికాయి. దీంతో విప్లవ ఉద్యమంలో షహీద్ పీర్ అలీ ఖాన్ పాత్ర ఉందని అధికారులు నమ్మారు. అయితే, బ్రిటీష్ వారితో పోరాడాలనే తన సంకల్పం కారణంగా అలీ కాస్త వెనక్కి తగ్గేందుకు నిరాకరించాడు. అధికారుల డిమాండ్లకు తలొగ్గలేదు.
ఈ క్రమంలోనే పీర్ అలీ ఖాన్ 03 జులై 1857న పాట్నాలో తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. పాట్నా నగరం నడిబొడ్డున ఒక ఆంగ్ల పూజారిపై తొలి దాడి యత్నం జరిగింది. కానీ, పూజారి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఓపియం ఏజెంట్‌కు ప్రధాన సహాయకుడు డాక్టర్ లైల్‌ను తిరుగుబాటు దారులు చంపేశారు. ఈ ఘటన తర్వాత షహీద్ పీర్ అలీ ఖాన్, ఇతర విప్లవకారులను బ్రిటీష్ సైన్యం అరెస్టు చేసింది. తిరుగుబాటు గురించిన సమాచారం ఒప్పుకోలేదు.
చేసిన తప్పుకు క్షమాపణ కోరమని అధికారులు అడగ్గా అందుకు నిరాకరించాడు. ‘మీరు నన్ను లేదా నా లాంటి వారిని ప్రతిరోజూ ఉరితీయవచ్చు, కానీ నా స్థానంలో వేలాది మంది పుట్టుకొస్తారు. మీరు అనుకున్నది ఎన్నటికీ సాధించలేరు’అని పీర్ అలీ ఆఖరి మాటలను విలియం తన పుస్తకంలో రాసుకొచ్చాడు. కాగా, 07 జులై 1857న పీర్ అలీఖాన్‌కు బహిరంగంగా ఉరితీశారు. అతన్ని ఉరితీసిన ప్రదేశానికి ‘షాహీద్ పీర్ అలీ ఖాన్ పార్క్’ అని నామకరణం చేయబడింది. అతని పేరు మీద పాట్నాలో ఒక రోడ్ కూడా ఉంది.