రేవంత్ రెడ్డి (Revanth Reddy) టీపీసీసీ (TPCC) చీఫ్ గా నియామకం అయిన తరువాత దూకుడు పెంచారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress)ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న రేవంత్.. బీఆర్ఎస్ (BRS)పై అప్డేట్ అస్త్రాలతో విరుచుకు పడుతున్నారని కార్యకర్తలు సంబరపడుతున్నారు. స్టేషన్ ఘన్ పూర్ (Station Ghanpur)లో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. గులాబీ దళం పై కీలక వ్యాఖ్యలు చేశారు.
నిరుద్యోగ యువత అడవిలో అన్నలుగా మారడానికి తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదని రేవంత్ మండిపడ్డారు. నమ్మించి ఇంత కాలం మోసం చేసిన బీఆర్ఎస్ పాలనపై.. ప్రజలకు నమ్మకం పోయిందన్న రేవంత్.. ఉద్యోగాలు రాని యువత అంతా కాంగ్రెస్ గెలవకపోతే అడవిలో అన్నలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు.. ఉద్యోగాల కోసం పోరాడి అలసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీలంకలో నాయకులకు జరిగిన సన్మానం రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులకు జరిగే రోజులు దగ్గరలో ఉన్నాయని రేవంత్ గుర్తు చేశారు. అలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వంలో ఒక్కరు కూడా ఉండరని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారాలు చేస్తూ.. రైతుబంధు బంద్ అవుతుందని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేయడం సిగ్గు చేటని రేవంత్ మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని పేర్కొన్న రేవంత్.. పార్టీ అధికారంలోకి వస్తే రైతులతో పాటు కౌలు రైతులకు సైతం భరోసా ఇస్తామని.. ఉపాధి హామీ కూలీకి వెళ్లే ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.12 వేలు వచ్చేలా చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ (KCR) ఓడిపోతే 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే ఇళ్లకు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తామన్నారు. మరోవైపు ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. అభివృద్థి పేరుతో దోపిడి చేస్తున్న దళారులు కావాలా.. ప్రజా క్షేమమే తమ క్షేమంగా భావించే కాంగ్రెస్ కావాలో తేల్చుకొందని రేవంత్ వెల్లడించారు..