Telugu News » Revanth Reddy : కేసీఆర్ అవినీతి కనిపించడం లేదా?

Revanth Reddy : కేసీఆర్ అవినీతి కనిపించడం లేదా?

బీజేపీ, బీఆర్ఎస్‌ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లిందన్న రేవంత్.. పతనం మొదలైందని హెచ్చరించారు. ఈ కవ్వింపు చర్యలు కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింత కసి పెంచాయని.. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు.

by admin

– బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు సాగవు
– కాంగ్రెస్ నేతలపైనే దర్యాప్తు సంస్థల దాడులెందుకు?
– కేసీఆర్ ఎంత అవినీతి చేసినా చర్యలుండవా?
– ఈ సోదాలు మాలో మరింత కసి పెంచాయి
– బీఆర్ఎస్, బీజేపీకి తగిన బుద్ధి చెప్తాం
– రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ఓవైపు ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుంటే.. ఇంకోవైపు అభ్యర్థుల ఇళ్లల్లో దర్యాప్తు సంస్థలు దాడులకు దిగాయి. అదికూడా కాంగ్రెస్ (Congress) నేతల ఇళ్లు, ఆఫీసులు, సంబంధీకులనే టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ నాయకులే టార్గెట్‌ గా ఈడీ (ED), ఐటీ (IT) దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివో.. ఈ సోదాల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని కోరారు.

revanth reddy fire on kcr family in dubbaka public meating

కాంగ్రెస్‌ కు గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్దీ.. దర్యాప్తు సంస్థల దాడులు పెరుగుతున్నాయని అన్నారు రేవంత్. మోడీ (Modi), కేసీఆర్ (KCR) కలిసి ప్రణాళిక రచిస్తే పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి అమలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) కుమ్మక్కు రాజకీయాలను గమనించాలని కోరారు. అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను కూడా మోడీ, కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారని విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలలో చేరిన వాళ్లు పవిత్రులు.. ప్రతిపక్షంలో ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులా? అని ప్రశ్నించారు.

ఇదంతా దేశంలో, రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదని.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ అని ఆరోపించారు రేవంత్. వీళ్లు తమ కుట్రలు, కక్షలతో చివరకు ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని సైతం వేధిస్తున్నారని మండిపడ్డారు. కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు. గడిచిన పదేళ్లలో మోడీ, షా ఆదేశాలు లేకుండా ఈడీ, ఐటీ సంస్థల్లో చీమచిటుక్కుమన్నది లేదన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్‌ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లిందన్న రేవంత్.. పతనం మొదలైందని హెచ్చరించారు. ఈ కవ్వింపు చర్యలు కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింత కసి పెంచాయని.. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. మరెన్ని దాడులు చేసినా కాంగ్రెస్ గెలుపును ఆపలేరని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లనీయకుండా కాంగ్రెస్ అభ్యర్థులను బందీగా ఉంచుతున్నారని.. పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై కూడా ఉందన్నారు.

దర్యాప్తు సంస్థలకు కేసీఆర్ అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇళ్లు, ఆఫీసుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని.. కేసీఆర్‌ కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఎందుకు వెళ్లరని అడిగారు. కాళేశ్వరం అవినీతి బట్టబయలైతే ఎందుకు చర్యలు తీసుకోరని నిలదీశారు. ఏం జరిగినా బీఆర్ఎస్ పై చర్యలుండవని.. కాంగ్రెస్ నేతలు పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల, వివేక్ ఇళ్లు, కార్యాలయాలపై మాత్రం విరుచుకుపడుతున్నాయని దర్యాప్తు సంస్థలపై మండిపడ్డారు.

You may also like

Leave a Comment