హైదరాబాద్ (Hyderabad) లో గణేష్ ఉత్సవాల (Vinayaka Chavithi) సందడి మొదలైంది. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు నగరంలో ఎటుచూపినా వినాయకుడి సంబరాలే కనిపిస్తాయి. ఈ వేడుకలను చూసేందుకు నగరం నలుమూలల నుంచే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ కు భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. దీని ప్రభావం అంతా నగర ట్రాఫిక్ (Traffic) పై పడుతుంది.
దీంతో నగరంలో ట్రాఫిక్, భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉత్సవాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు నగర వ్యాప్తంగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
వినాయక చవితంటే హైదరాబాద్ లోని ఖైరతాబాదే అందరికి గుర్తొస్తుంది. ఈ ఏడాది అత్యంత ఎత్తైన మట్టి విగ్రహాన్ని కూడా ఖైరతాబాద్ లోనే ప్రతిష్టించారు. ఈ వినాయకుడిని చూసేందుకు ప్రతి రోజూ పెద్ద ఎత్తున్న భక్తులు వస్తుంటారు.ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షల మంది భక్తులు నగరానికి వస్తారు.
ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్త అవకాశం ఉండటంతో ఇక్కడ ట్రాఫిక్ అంక్షలు విధించారు.
ఇందులో భాగంగా ఖైరతాబాద్ పరిసరాల్లో 11 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతాయిని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా ట్రాఫిక్ అంక్షలు దృష్టిలో పెట్టుకుని పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈవైపుగా వస్తే…కాస్త చూసుకోండి…
రాజ్ దూత్ లైన్ నుంచి – గణేష్ టైపు రోడ్డులో ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. రాజ్ దూత్ లేన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు వాహనాలను మళ్లిస్తారు. రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్ వెళ్లే సాధారణ ట్రాఫిక్కు అనుమతి లేదు. అటు వైపు వెళ్లే వాహనాలను రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు డైవర్ట్ చేస్తారు. మింట్ కాంపౌండ్ నుండి ఐమాక్స్ థియేటర్ వైపు సాధారణ ట్రాఫిక్ అనుమతి లేదు. అటుగా వెళ్లే వాహనాలు మింట్ శ్రీ కాంపౌండ్ వద్ద తెలుగు తల్లి జంక్షన్ వైపు డైవర్ట్ చేస్తారు. ఈ ఆంక్షలు ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.