టీఎస్ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు (CMD Prabhkar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యుత్ సంస్థలకు ప్రజల నుంచి భారీగా వస్తున్న ఆదరణ చూసి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఓర్వ లేక పోతున్నారంటూ ఆయన మండిపడ్డారు. తమ ప్రగతిని అడ్డుకునేందుకు కొంత మంది ఐఏఎస్ (IAS) అధికారులు ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.
సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పినప్పటికీ విద్యుత్ సంస్థలకు నిధులు విడుదల చేయడం లేదని అన్నారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తునప్పటికీ కుదరడం లేదన్నారు. మింట్ కాంపౌండ్‌లో అకౌంట్స్ ఆఫీసర్స్ యూనియన్ భవనాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… విద్యుత్ సంస్థలకు వస్తున్న విశేష ఆదరణను చూసి ఓర్వలేక కొందరు తమ ప్రగతిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంలోని కొంత మంది అధికారులను తాను చేతులు జోడించి వేడుకుంటున్నట్టు చెప్పారు. ఇలాంటి విధానాలు కొనసాగితే విద్యుత్ సరఫరాలో లోపాలు తలెత్తే అవకాశాలు వస్తాయని చెప్పారు.
ఈ విషయాలు వెల్లడించాక తమను పదవుల నుంచి తొలగించేందుకు కుట్రలు కూడా జరిగే అవకాశం ఉందన్నారు. అలా జరిగినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఎందుకంటే తమను ఉద్యోగంలోకి ఈ ఐఏఎస్ లో తీసుకోలేదన్నారు. తమను నియమించింది సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2126 యూనిట్లు ఉందని ప్రభాకర్ రావు పేర్కొన్నారు.