అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) ప్రచార పర్వం ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అగ్రనేతలు గెలుపు కోసం ఉవ్విల్లూరుతున్నారు. బయటకు ఎవరికి వారు విజయం తమదేనని చెప్తున్నా లోలోపల కొంత ఆందోళనలో ఉన్నారు. దీంతో ప్రశాంతత కోసం పలువురు నేతలు ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని బిర్లా టెంపుల్(Birla Temple)కు వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది.
బుధవారం ఉదయం గాంధీభవన్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఇన్చార్జి ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, వీహెచ్ (VH) పలువురు నేతలు బిర్లా టెంపుల్‌కు బయలుదేరారు. అయితే గాంధీభవన్ ముందు కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అంతా ఏం జరుగుతుందోనని అక్కడున్న వారు ఉత్కంఠగా ఎదురుచూశారు.
ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ నేతలతో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఐదుగురు మాత్రమే వెళ్లాలని సూచించారు. పోలీసుల సూచనల మేరకు కేవలం రేవంత్, ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి మాత్రమే బిర్లా టెంపుల్‌కు వెళ్లారు. దీంతో ఎలాంటి ఆందోళనలు, ఉద్రిక్తత చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు ఆలయంలో వేంకటేశ్వర స్వామి గ్యారెంటీ కార్డు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఠాక్రే, వీహెచ్, అంజన్‌కుమార్ యాదవ్, నరేందర్‌రెడ్డి, మల్లు రవి, తదితరులు నాంపల్లి దర్గా వద్ద ప్రార్థనలు చేశారు.