– గ్రూప్-1 ప్రిలిమ్స్ పై టీఎస్పీఎస్సీ వివరణ
– అదనపు పేపర్ల ఆరోపణలపై ఖండన
– లక్షల మంది రాసినప్పుడు..
– అంకెల్లో స్వల్ప మార్పులు కామనే
– స్కానింగ్ తర్వాత తుది సంఖ్య ప్రకటించామని స్పష్టం
– ఎలాంటి అవకతవకలు జరగలేదన్న టీఎస్పీఎస్సీ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని పేర్కొంది. జూన్ 11న జరిగిన పరీక్షపై వివరణ ఇచ్చింది. మొత్తం 258 పేపర్లు అదనంగా వచ్చాయన్న ఆరోపణలపై స్పందించింది. పరీక్ష రోజు కలెక్టర్ల సమాచారం ఆధారంగా ప్రకటన ఇచ్చామని తెలిపింది.
కలెక్టర్ల సమాచారం మేరకు మొదట 2,33,248 మంది పరీక్ష రాసినట్టు తెలిపామని చెప్పింది. పారదర్శకత కోసం అదే విషయాన్ని మీడియాకు చెప్పామని వెల్లడించింది. ఆ తర్వాత ఓఎంఆర్ స్కానింగ్ చేపట్టామని వివరించింది. కానీ, ఓఎంఆర్ స్కానింగ్ లో 2,33,506 మంది పరీక్ష రాశారని తేలినట్టు చెప్పింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను 33 జిల్లాల్లో 994 కేంద్రాల్లో నిర్వహించామని.. అనేక జిల్లాల్లో లక్షలాది మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపింది. లక్షల మంది పరీక్షలు రాసినప్పుడు అంకెల్లో స్వల్ప మార్పులు రావడం సహజమేనని స్పష్టం చేసింది.
స్కానింగ్ తర్వాత తుది సంఖ్య ప్రకటించామని వివరణ ఇచ్చింది. పరీక్ష తర్వాత కొన్ని పేపర్లు కలిపేందుకు ఆస్కారమే లేదని తేల్చి చెప్పింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసింది టీఎస్పీఎస్సీ