తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలుచేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో మహాలక్ష్మి పథకం కింద రేపట్నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు శనివారం మధ్యాహ్నం నుంచి ఉచితంగా ప్రయాణించొచ్చని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు అంతర్ రాష్ట్ర ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సులలో ప్రయాణం ఉచితంగా చేయవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. అయితే మహిళా ప్రయాణికులు ప్రయాణించే దూరం ఆధారంగా వసూలు చేసే ఛార్జీలను.. టీ కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తుంది. అదీగాక ప్రయాణం విషయంలో మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను (Mahalakshmi Smart Cards) త్వరలోనే అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం తెలంగాణ ప్రజలకు మాత్రమే అని తెలిపింది.
సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఈ పథకాన్ని లాంఛ్ చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. మహాలక్ష్మి పథకంపైనే నిన్నటి కేబినెట్లో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు.
రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar) వెల్లడించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభిస్తారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ ఇస్తారని వివరించారు. మహాలక్ష్మి పథకం వల్ల ప్రజా రవాణాకు మేలు జరుగుతుందని చెప్పారు. కొవిడ్ వల్ల ప్రజారవాణాకు తీవ్ర విఘాతం కలిగిందని ఆవేదన చెందారు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం వల్ల ప్రజా రవాణా పుంజుకుంటుందని వివరించారు.
మహిళలు బస్సు ఎక్కడైనా ఎక్కవచ్చు. ఎక్కడైనా దిగవచ్చని తెలిపిన సజ్జనార్, ఉచిత ప్రయాణాలకు ఎలాంటి పరిమితులు, షరతులు లేవని వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రోజుకు ఎన్నిసార్లయినా వెళ్లవచ్చు కానీ రాష్ట్రం, కేంద్రం జారీ చేసే ఏదైనా గుర్తింపు కార్డు తప్పని సరిగ్గా చూపాలని తెలిపారు.
సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ద్వారా మహిళల స్వయం శక్తి మెరుగవుతుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు. ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఇప్పటికే ఆర్టీసీ సిబ్బందికి నిబంధనలు జారీ చేశామన్నారు. వయసుతో సంబంధం లేకుండా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని సజ్జనార్ చెప్పారు.