Telugu News » Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 26 వరకు ఆర్జిత సేవలను టీటీడీ రద్దుచేసింది.

by Prasanna
TTD

తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో నేటి నుండి ఈ నెల 26వ తేదీ వ‌ర‌కు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు (Brahmotsavalu) ఆదివారం సాయంత్రం టీటీడీ (TTD) శాస్త్రోక్తంగా అంకురార్పణ చేసింది.  శ్రీవారి  సేనాధిపతి విష్వక్సేనుడిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఆల‌యంలోని యాగశాలలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. పుట్ట‌మన్నులో న‌వ‌ ధాన్యాలను పోసి అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

TTD

బ్రహ్మోత్సవాల వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో శుభ్రం చేసి, బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆవాహన చేస్తారు. అనంతరం భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 26 వరకు ఆర్జిత సేవలను టీటీడీ రద్దుచేసింది. ఇవాళ సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. అనంతరం పెద్దశేష వాహన సేవతో బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభమవుతాయి.

TTD 2

బ్రహ్మోత్సవాల సేవల వేళలు ఇలా..

18న సాయంత్రం 6.30 గంటలకు ధ్వజారోహణం జరుగుతుంది. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహన సేవ ఉంటుంది.

19న ఉద‌యం 8 నుంచి 10 గంట‌ల‌ వ‌ర‌కు చిన్నశేష వాహన సేవ, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంసవాహన సేవ జరుగుతుంది.

20న ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య సింహ వాహ‌న సేవ ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య స్నపనతిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహన సేవ జరుగుతుంది.

21న ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కల్ప వృక్ష వాహన సేవ, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహన సేవలు ఉంటాయి.

22న ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మోహినీ అవతారంలో స్వామి కనిపిస్తారు. రాత్రి 7 గంటలకు గరుడ సేవ ప్రారంభమవుతుంది.

23న ఉద‌యం 8 నుంచి 10 గంట‌ల‌ వరకు హ‌నుమంత వాహ‌న సేవ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య స్వర్ణ రథోత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజవాహన సేవ నిర్వహిస్తారు.

24న ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం స్నపనతిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవలు ఉంటాయి.

25న ఉదయం 6.55 గంటలకు రథోత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వవాహన సేవ జరుగుతుంది.

26న ఉదయం 3 నుంచి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం జరుగుతుంది. తిరుచ్చి ఉత్సవం అయిన తర్వాత ఉదయం 6 నుంచి 9 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రసాన్నం జరుగుతుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి.

మరో వైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. తొమ్మిది కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 16 నుంచి 12 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తోన్నారు.

 

You may also like

Leave a Comment