దేశంలో ఈమధ్య భారీ వర్షాలు, వరదలతో టమాటా (Tomato) ధరలు ఆకాశాన్ని తాకాయి. రికార్డ్ స్థాయిలో కేజీ రూ.300 వరకు వెళ్లింది. ఒకనాడు రూపాయికి అమ్మలేక చెత్తకుప్పలో పడేసిన రైతులు (Farmers).. ఈసారి అధిక ధరలతో బాగా లాభపడ్డారు. కొందరైతే కోట్లు సంపాదించిన వారున్నారు. ప్రజలు అంత రేటు పెట్టి కొనలేక ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. అయితే.. ఇప్పుడిప్పుడే రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. కొన్నాళ్లుగా కిందకు దిగనని చెట్టెక్కి కూర్చున్న టమాటా ఇప్పుడిప్పుడే కింద చూపులు చూస్తోంది. ఇప్పుడు టమాటా దారిలోనే పసుపు కూడా నడుస్తోంది.
మొన్నటిదాకా టమాటా రైతులు పండుగ చేస్కుంటే.. ఇప్పుడు పసుపు (Turmeric) రైతులు చేసుకుంటున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో పసుపు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత మూడు రోజుల్లో క్వింటాల్ పసుపు ధర రెట్టింపు అయింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా పసుపు డిమాండ్ పెరగడంతో పాటు నిల్వలు తగ్గడంతో ధరలు పైపైకి చూస్తున్నాయి.
గత వారం క్వింటాల్ రూ.6వేలు పలికిన పసుపు.. ప్రస్తుతం రూ.13 వేలు దాటింది. రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. మరోవైపు, రైతులను దళారులు మోసం చేస్తున్నట్టు తెలుస్తోంది. మార్కెట్ యార్డుల్లో మంచి ధర పలుకుతున్నప్పటికీ కొందరికే క్వింటాల్ రూ.13 వేలు చెల్లిస్తున్నారని కొందరు రైతులు అంటున్నారు.
పెట్టుబడులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారులు దృష్టిపెట్టి.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు రైతులు. దళారులు తక్కువ ధరకు కొనాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు.