ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ (KRMB) నిర్వహిస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని.. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యాలు నెరవేరకపోగా నష్టం జరిగే అవకాశం ఉందని.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, పార్టీ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాతూ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు..
కేఆర్ఎంబీ పరిధిలోకి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను తీసుకెళ్లడం సరికాదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో రాలేదని అన్నారు.. తెలంగాణ (Telangana) ఏర్పడిందే నీళ్ల కోసమని.. కానీ కేంద్ర షరతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకున్నదని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు..
కృష్ణా జలాల కోసం కేసీఆర్ ఎప్పుడూ పోరాడలేదనేది వట్టి ప్రచారం మాత్రమేనని.. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆరోపించారు.. ప్రాజెక్టుల విషయంలో మంత్రుల ప్రకటన ఆశ్వర్యం కలిగిస్తున్నదని విమర్శించిన నిరంజన్ రెడ్డి.. కేంద్రానికి రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం తాకట్టు పెట్టిందని మండిపడ్డారు.. కేఆర్ఎంబీకి, శ్రీశైలం, సాగర్లను అప్పగిస్తే నిర్మాణం కావలసిన ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడించారు.
జల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో పాటుగా.. ప్రతి విషయంలో కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుందని పేర్కొన్నారు.. అందువల్ల రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు.. ప్రాజెక్టుల్లో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని, యాసంగికి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.