శాసనాలు దేశ చరిత్రకు వెన్నెముక లాంటివన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy). వాటిని కాపాడాల్సిన బాధ్యత, భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. దేశంలోనే తొలి ఎపీగ్రఫీ (Epigraphy) మ్యూజియానికి హైదరాబాద్ (Hydearabad) లోని సాలార్ జంగ్ మ్యూజియం (Salarjung Museum) వద్ద సోమవారం కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర సహకారంతో తొలి ఎపీగ్రఫీ మ్యూజియం ఏర్పాటు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
గత చరిత్ర అంతా శిలాశాసనాల మీదే ఉండేదని, భావితరాల కోసం వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు కిషన్ రెడ్డి. అనేక దండయాత్రల వల్ల దేశంలో శిలా శాసనాలు ధ్వంసం అయ్యాయని, దేశ సంస్కృతి, సంప్రదాయాలను ఎప్పుడూ మరువకూడదని సూచించారు. సాలార్ జంగ్ మ్యూజియం రూపు రేఖలు మార్చామన్న కిషన్ రెడ్డి.. అంతర్జాతీయ స్థాయిలో మ్యూజియాన్ని అభివృద్ధి చేశామన్నారు.
శిలా శాసనాలపై ఉన్న లిపిలను డిజిటలైజ్ చేసి, అందరికీ అర్థమయ్యేలా వారి వారి మాతృభాషల్లోకి మార్చేందుకు కృషి చేస్తామని తెలిపారు కేంద్రమంత్రి. జ్ఞానవాపిలో అనేక శాసనాలు ఉన్నాయని, అక్కడ ఉన్న చరిత్రను ప్రజల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎపీగ్రఫీ డిపార్ట్మెంట్ కృషితో జ్ఞానవాపిలో ఉన్న ఆధారాలను రీసెర్చ్ చేసి కోర్టు ముందు ఉంచారని చెప్పారు. కోర్టు చాలా తక్కువ సమయం ఇచ్చిందని, త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పారు.
శిలా శాసనాలపై లిఖించిన లిపిని డీ కోడ్ చేసే అధ్యయన సిస్టం ఈ మ్యూజియంలో ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. గతంలో ఇలాంటి మ్యూజియం పెట్టుకునేందుకు భూమి కోసం కేసీఆర్ కు అనేక సార్లు లేఖలు రాశానని గుర్తు చేశారు. కానీ, ఆయన నుంచి జవాబు రాలేదన్నారు. ఎపీగ్రఫీ మ్యూజియం ఏర్పాటుకు ప్రధాని మోడీ కృషి ఎనలేనిదని.. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.