పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘన (Parliament Security Breach)పై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరి రాజ్ సింగ్ (Giri Raj Singh) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మహమ్మద్ అలీ జిన్నా భావజాలంతో ప్రభావితమై ఓవైసీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు.
అసదుద్దీన్ ఓవైసీలోకి మహ్మద్ అలీ జిన్నా ఆత్మ చొరబడిందని విమర్శలు గుప్పించారు. అందుకే అసదుద్దీన్ ప్రతి విషయంలోనూ కేవలం ముస్లింలను మాత్రమే చూస్తారని అన్నారు. ఇప్పుడు నేరస్తుల్లో కూడా హిందూ-ముస్లిం కోణాన్ని వెతకేందుకు అసద్ ప్రయత్నిస్తున్నారని గిరిరాజ్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉగ్రవాదుల విశ్వాసం, కులం, మతం వంటి పట్టింపులు ఏవీ లేవని కేంద్ర మంత్రి తెలిపారు. మోడీ సర్కార్ హయాంలో ఉగ్రవాదులను వారి మతపరమైన అనుబంధాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉగ్రవాదులుగాను తాము పరిగణిస్తున్నామని చెప్పారు.
పార్లమెంట్ లో స్మోక్ అటాక్ ఘటనలో నిందితులు ముస్లిం వ్యక్తులు అయి ఉండి వుంటే ఎలా ఉండేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయని నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలు ఉగ్రవాదులు, తీవ్రవాదులను హిందూ-ముస్లింల అనే కోణంలో చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అమిత్ షా పారిపోయే వ్యక్తి కాదన్నారు. షా దృఢంగా నిల్చుని సమాధానం చెప్పే వ్యక్తి అని స్పష్టం చేశారు.