యూపీలో యోగీ (Yogi Adityanath) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హలాల్ ట్యాగ్ (Halal Tag) ఉన్న ఆహార ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. హలాల్ ట్యాగ్‌తో ఆహార ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని యోగీ సర్కార్ వెల్లడించింది.
ఇక ఎగుమతి చేసేందుకు ఉద్దేశించిన ఆహార పదార్థాల విషయంలో ఈ నిషేధం వర్తించదని తెలిపింది. ఆహార ఉత్పత్తులకు హలాల్ ధృవీకరణ అనేది ఒక సమాంతర వ్యవస్థ అని ప్రభుత్వం పేర్కొంది. ఇది ఆహార పదార్థాల నాణ్యతకు సంబంధించి తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
ఫుడ్ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఈ హలాల్ ధ్రువీకరణ అనేది అమోదయోగ్యం కాదని ప్రకటనలో ప్రభుత్వం వివరించింది. ఆ చట్టంలోని 29 ప్రకారం ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి వాటి ప్రమాణాలను నిర్ణయించే హక్కు కేవలం అధికారులు, కొన్ని ప్రభుత్వ సంస్థలకు మాత్రమే ఉందని తేల్చి చెప్పింది.
ఇటీవల రాష్ట్రంలో కొంత మంది వ్యాపారస్తులు తమ ఆహార ఉత్పత్తులపై నకిలీ హలాల్ సర్టిఫికేట్ లేబుల్స్ ను అంటిస్తున్నారు. ఆ నకిలీ హలాల్ సర్టిఫికెట్స్ ద్వారా ప్రజల మతపరమైన భావాలను ఉపయోగించుకుని తమ ఆహార ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకుంటూ దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తు ఇటీవల పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.