13 నెలల చిన్నారి కడుపులో నుంచి కిలోన్నర బరువున్న పిండాన్ని తొలగించి ఆ పాపకు డాక్టర్లు పునర్జన్మనిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలోని పీడియాట్రిక్ విభాగం వైద్యులు మూడు గంటలపాటు ఆపరేషన్ చేసి ఈ ఘనత సాధించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ పాప తలిదండ్రులు షాహిజాద్ ఆలం, రహీమా ఖాతూన్ ల ఆనందానికి అంతు లేదు.
విజయవంతంగా అత్యంత జటిలమైన శస్త్ర చికిత్స చేసి తమ చిన్నారి ప్రాణాలు నిలబెట్టినందుకు వారు వైద్యుల బృందానికి ధన్యవాదాలు తెలిపారు. పీడియాట్రిక్ సర్జన్ ప్రొఫెసర్ జెడి. రావత్ ఆధ్వర్యంలో జులై 31 న ఈ ఆపరేషన్ జరిగింది. గత 5 నెలలుగా కడుపు వాపుతో బాధ పడుతున్న ఈ పాపను ఆమె తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. కానీ ఆమె ఏమీ తినలేక, తాగలేక బాధపడుతూ వచ్చింది.
బరువు కూడా తగ్గిపోవడంతో ఆందోళన చెందిన ఆమె పేరెంట్స్ ఆమెను ఈ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈమె కడుపులో పెద్ద సిర, ధమని ఎడమ కిడ్నీ, ఎడమ ఊపిరితిత్తుల పొరకు అతుక్కుని పిండం ఉన్నట్టు గుర్తించిన వైద్య బృందం .. ఆపరేషన్ చేసి కిలోన్నర బరువున్న పిండాన్ని తొలగించింది. ఫీటస్ ఇన్ ఫీటూ అని ఈ వ్యాధిని అంటారని, మొత్తానికి చిన్నారి క్షేమంగా ఉందని డాక్టర్ రావత్ తెలిపారు.
ఇటీవల ఏడు నెలల వయసున్న బాలుడి కడుపులో నుంచి ఆరు నెలల వయసున్నట్టు భావిస్తున్న పిండాన్ని వైద్యులు విజయవంతంగా తొలగించారు. సుమారు రెండు కిలోల బరువున్న పిండాన్ని తొలగించేందుకు వారు శ్రమించారు. ప్రయాగ్ రాజ్ జిల్లాలోని సరోజినీ నాయుడు పిల్లల ఆసుపత్రి డాక్టర్లు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ బాలుడి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్టు వారు చెప్పారు