US : మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ (Modi) చేసిన ప్రసంగం పట్ల ఆఫ్రికన్-అమెరికన్ నటి, సింగర్ కూడా అయిన మేరీ మిల్ బెన్ (Mary Millben) హర్షం ప్రకటించారు. మణిపూర్ ప్రజల సంక్షేమానికి ఆయన ఎప్పుడూ పోరాడుతుంటారని ఆమె అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా పార్లమెంట్ లో మోడీ చేసిన ప్రసంగంపై స్పందించిన ఆమె.. తమ నాయకునిపై ఇండియాకు అత్యంత విశ్వాసం ఉందన్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా విపక్షాలు గట్టిగా మోడీ నాయకత్వాన్ని సమర్థించాలన్నారు.
సత్యమన్నది సదా స్వేచ్చకు బాటలు పరుస్తూనే ఉంటుందని పేర్కొన్న ఆమె.. మోడీ పట్ల తనకెంతో విశ్వాసం ఉందన్నారు. ఈ సందర్భంగా దివంగత అమెరికన్ పౌర హక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గురించి ఆమె ప్రస్తావించారు. ఇండియాలోని ముఖ్యంగా మణిపూర్ లోని తల్లులు, కూతుళ్లు, మహిళలకు న్యాయం జరుగుతుందని, వారి స్వేచ్ఛ కోసం మోడీ నిరంతరం పోరాడుతారని మేరీ మిల్ బెన్ వ్యాఖ్యానించారు.
సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించకుండా.. తమ దేశ జాతీయ గీతాన్నిపాడేందుకు పిల్లలకు హక్కును కూడా కల్పించకుండా చూసే ఓ పార్టీకి .. విదేశాల్లోనూ నాయకత్వం అంటూ ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇలా పరోక్షంగా విపక్షాలను తప్పు పట్టారు. గత జూన్ లో మోడీ అమెరికాను సందర్శించినప్పుడు మేరీ మిల్ బెన్ వాషింగ్టన్ డీసీలో భారత జాతీయ గీతాన్ని పాడడమే గాక.. ఆయనకు పాదాభివందనం చేశారు. ఆయన ఆశీస్సులు అందుకున్నారు.