ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) వ్యవహారంలో జోక్యంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అమెరికా (USA) వివరణ ఇచ్చింది. ఈ మేరకు యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్(Matthew Miller) మాట్లాడుతూ కేజ్రీవాల్ విషయంలో తాము అనుకూల వైఖరిని ప్రదర్శించలేదని స్పష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ పరిణామాలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(Jaishankar) ఈ అంశంపై మాట్లాడుతూ ఒకరి అంతర్గత విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కేసు విషయంలోనూ మిల్లర్ స్పందించారు. ఆ వివరాలను తాను వెల్లడించలేనన్నారు. ఇక భారత్ వైపు నుంచి జరిగిన దర్యాప్తు ఫలితం కోసం వేచి చూస్తున్నామన్నారు. భారత్ పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కోరారు.
అయితే మాథ్యూ మిల్లర్ ఢిల్లీ సీఎం కేజ్రివాల్ విషయంలో మాట్లాడి.. పాక్లో ప్రతిపక్ష నేతల అరెస్టులపై మాత్రం మౌనంగా ఉన్నారనే విమర్శలొచ్చాయి. ఈ విషయాన్ని ఓ జర్నలిస్టు నేరుగా ఆయన వద్దే ప్రస్తావించారు. దీనికి స్పందించిన మాథ్యూ మిల్లర్ తాము ఎవరికీ అనుకూలం కాదని, ప్రతీఒక్కరిని చట్టం ప్రకారం సమానంగా చూడాలన్నారు.
కేవలం మానవ హక్కుల విషయంపైనే మాట్లాడామని పేర్కొన్నారు. అదేవిధంగా పాక్లో ప్రతీఒక్కరిని చట్ట ప్రకారమే చూడాలని, వారి హక్కులను గౌరవించాలని పలుమార్లు చెప్పినట్లు మాథ్యూమిల్లర్ చెప్పారు. అదే వైఖరిని ప్రపంచంలోని అన్ని దేశాల విషయంలోనూ అనుసరిస్తామని వెల్లడించారు.