దీపావళి సంబరాన్నే కాదు.. ప్రమాదాన్ని కూడా తీసుకువస్తుందని వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలను చూస్తుంటే తెలుస్తుంది. ఈ పండగ కొందరికి ఆనందాన్ని ఇస్తుంటే.. మరి కొందరికి భయాన్ని, బాధను జ్ఞాపకంగా ఇస్తుంది. ఇప్పటికే దీపావళి సందర్భంగా ఎన్నో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
మరోవైపు రైలులో ఫైర్ కు సంబంధించిన వస్తువులు నిషేధం అన్న విషయం తెలిసిందే. కానీ కొందరు దొంగ చాటుగా తీసుకెళ్ళి ప్రమాదాలకు కారణం అవుతారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బరేలీ (Bareilly) జంక్షన్‌లో జరిగింది. బీహార్ (Bihar) వెళ్తున్న దిబ్రూగఢ్-లాల్‌ఘర్ ఎక్స్‌ప్రెస్ (Dibrugarh-Lalgarh Express) జనరల్ కోచ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు చీఫ్ ఫైర్ ఆఫీసర్ (CFO) చంద్ర మోహన్ శర్మ తెలిపారు.
ఓ వ్యక్తి అక్రమంగా పటాకులు తీసుకెళ్లే క్రమంలో సిగరెట్ వెలిగించగా.. బోగీలో మంటలు అంటుకున్నట్టు రైల్వే సిబ్బంది పేర్కొన్నారు.. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే ఓ ప్రయాణికుడు మాత్రం స్వల్పంగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియల్సి ఉందని అన్నారు.